Annaram Pump House: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్నారం (సరస్వతి) పంప్‌హౌస్‌లో రెండో పంపు నుంచి విజయవంతంగా నీటిని ఎత్తిపోశారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి పునరుద్ధరణ పూర్తి చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజెపడుగు వద్ద ఉన్న ఈ పంప్‌హౌస్.. జులై వరదల్లో మునిగింది. వరద నీటిని తోడివేశాక మోటార్లను ఆరబెట్టి పంపులను పునరుద్ధరిస్తూ వస్తున్నారు. ఈ నెల 8న మొదటి పంపును నడిపించారు. తాజాగా రెండోపంపు అందుబాటులోకి వచ్చింది. వచ్చే నెల మొదటి వారంలోపు మిగిలిన పంపులను కూడా నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ యాదగిరి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఉపేందర్, నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. సాగునీటి ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ఇంజినీర్ ఇన్‌చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, ఇతరఇంజినీర్లు ఎత్తిపోతలను పర్యవేక్షిస్తున్నారు.