Seelam Rangaiah case:పెద్దపల్లి జిల్లా మంథనిలో నిందితుడు శీలం రంగయ్య కస్టోడియల్ మృతిపై హైకోర్టు విచారణ ముగించింది. గతేడాది మే 20న సాయంత్రం 4 గంటలకు మంథని పీఎస్ లాకప్‌లో ఉండగానే చోరీ కేసు నిందితుడు శీలం రంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని దివంగత న్యాయవాది పీవీ నాగమణి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
high court on case: హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ లాకప్ డెత్‌పై విచారణ జరిపి నివేదిక సమర్పించారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు. గంజాయి లేదా మద్యం మత్తులో శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో ఉందన్నారు. లాకప్ డెత్ ఘటనలో సీఐ, ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు ఏజీ వివరించారు. అడ్వకేట్ జనరల్ వివరణతో సంతృప్తి చెందిన హైకోర్టు.. పిల్‌పై విచారణ ముగించింది.
పోలీసుల పాత్ర లేదని నివేదిక..
పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన శీలం రంగయ్య మృతిపై హైకోర్టు ఆదేశాల ప్రకారం హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ విచారణ చేశారు. రామగిరి మండలం బుధవారంపేట(రామయ్యపల్లికి)కు చెందిన రంగయ్య కుటుంబాన్ని సీపీ అంజనీకుమార్ విచారించారు. తనతో ఉన్న ఇద్దరు సహా నిందితులను కూడా విచారించారు. మంథని పోలీస్ స్టేషన్లో రంగయ్య మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్లను విచారించిన సీపీ.. రంగయ్య మృతిలో పోలీసుల పాత్ర లేదని హైకోర్టుకు నివేదించారు. పూర్తి నివేదిక తెలుసుకోవాలంటే.. శీలం రంగయ్య మృతిపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన సీపీక్లిక్ చేయండి.
సీపీ నివేదికపై నాగమణి అభ్యంతరం..
సీపీ అంజనీకుమార్ సమర్పించిన నివేదికలో రంగయ్యది ఆత్మహత్యేనని పేర్కొనడంపై నాగమణి అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు అఫిడవిట్ దాఖలు చేస్తానని చెప్పారు. పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణాలకు రక్షణకల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె... రామగుండం పోలీసులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కమిషనర్ సత్యనారాయణ సహా పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని... కేసు విచారణ పూర్తయ్యేవరకు బదిలీ చేయాలని కోరారు. అనంతరం.. నాగమణి దంపతులు హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఈ కేసుపై అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది దామోదర్ రెడ్డి నియమితులయ్యారు.