తెలంగాణ

telangana

ETV Bharat / state

బొగ్గుకు ప్రత్యామ్నాయం...పంట వ్యర్థాల వినియోగం - telangana news

బొగ్గును మండించటం వల్ల వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. బొగ్గు ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రాల్లో పంటవ్యర్థాలను వినియోగించేందుకు అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీపీసీ దాద్రిలో కొంత వరకు పంట వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. తద్వారా థర్మల్​ విద్యుత్​ ఉత్పత్తికి అయ్యే వ్యయం తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో బొగ్గు పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడినా కాలుష్యాన్ని నియంత్రించేందుకు వేరే ప్రత్యామ్నాయం కనబడటం లేదు.

Electricity generation through crop wastage
పంట వ్యర్థాల ద్వారా విద్యుత్​ ఉత్పత్తి

By

Published : Apr 25, 2021, 7:55 PM IST

దేశంలో ఉన్న విద్యుత్తు కేంద్రాల్లో ఎక్కువ శాతం బొగ్గు ఆధారితంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. దీనివల్ల వెలువడే కార్బన్‌ ఉద్గారాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా వాయు నాణ్యత తగ్గిపోతుంది. సింగరేణి సంస్థ ఏటా 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఇందులో 80శాతం బొగ్గును విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేస్తోంది.

కాలుష్య నియంత్రణకు మార్గం

రానున్నకాలంలో బొగ్గు ద్వారా కాలుష్య సమస్యలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇటీవల ఈ విషయాన్ని పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనివల్ల ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సద్వినియోగం చేసుకున్నట్లవుతుందని వివరించింది. 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి 5 మిలియన్‌ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,792 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. సుమారుగా 40 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగిపోయి కార్బన్‌ ఉద్దారాలు గాలిలో కలుస్తున్నాయి. దీనివల్ల వాయు నాణ్యత తగ్గి ఆక్సీజన్‌ శాతం పడిపోతుంది. వీటిని నివారించేందుకు పంట వ్యర్థాలను వినియోగించడం ద్వారా థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని భావిస్తున్నారు.

పరిశ్రమపై ప్రభావం

పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తికి ఆలోచన చేస్తుండటంతో బొగ్గు పరిశ్రమపై ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యవసాయ వ్యర్థాలను వినియోగించడం ద్వారా చేపట్టే విద్యుత్తు ఉత్పత్తితో ఖర్చు సైతం తగ్గే అవకాశం ఉందని అంచనా. పంట పొలాల వద్ద దగ్ధం చేసే వ్యవసాయ వ్యర్థాలను పెల్లెట్స్‌ రూపంలో వినియోగించటం ద్వారా థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని పలువురు భావిస్తున్నారు. 10 మిలియన్‌ టన్నుల పెల్లెట్స్‌ ద్వారా 20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. బొగ్గుకు బదులు 100 శాతం పెల్లెట్‌లను వినియోగిస్తే ఒక యూనిట్‌ విద్యుత్తు ఉత్పత్తికి రూ.5 వరకు ఖర్చులో తేడా వస్తుంది. ఎన్టీపీసీ సంస్థ దాద్రి విద్యుత్తు కేంద్రంలో 100 టన్నుల వరిగడ్డి, చెరకుపిప్పి, ఆవగడ్డి వ్యర్థాలను ప్రయోగాత్మకంగా వినియోగించి విద్యుత్తు ఉత్పత్తి చేసింది. ఎన్టీపీసీకి చెందిన 17 విద్యుత్తు కేంద్రాల్లో ఏటా 50 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ వ్యర్థాలను వినియోగిస్తోంది. వ్యవసాయ వ్యర్థాల(పెల్లెట్ల) కోసం టెండర్లు ఆహ్వానించింది. దీంతో రానున్న కాలంలో బొగ్గు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇంధన వనరులపై దృష్టి

దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు పరిశ్రమ సింగరేణి. ఒకవైపు బొగ్గు ఉత్పత్తి చేస్తూనే మరోవైపు తమ భవిష్యత్తు సౌరశక్తి విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి సారించింది. సింగరేణి వ్యాప్తంగా 300 మెగావాట్ల సౌరశక్తి విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతుంది. మరోవైపు నీటిపై తేలియాడే సౌరపలకలను ఏర్పాటు చేసి 350 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు కరీంనగర్‌ లోయర్‌ మానేరు జలాశయాన్ని ఎంచుకుంది. భవిష్యత్తులో రానున్న ముప్పును ముందే గ్రహించిన సింగరేణి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే రామగుండంలో 10 మెగావాట్ల సౌరశక్తి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ఎన్టీపీసీ సంస్థ జలాశయంలో మరో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నీటిపై తేలియాడే సౌరపలకలను ఏర్పాటు చేస్తోంది. దీంతో రానున్న కాలంలో బొగ్గు వినియోగాన్ని తగ్గించి విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించినట్లవుతోంది.

ఇదీ చదవండి:నాతో నడిచే వ్యక్తిని ఎన్నుకోండి: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details