పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాస్కర్‌రావు భవన్లో సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో మఖ్దూం మొహియుద్దీన్ 59వ వర్ధంతిని నిర్వహించారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి కె.కనకరాజు పాల్గొని మఖ్దూం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మఖ్దూం మొహియుద్దీన్ స్వాతంత్ర సమరయోధుడు, ఉర్దూ కవి అని సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు తెలిపారు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నారని వెల్లడించారు.
ప్రగతిశీల భావాలతో పీడిత పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని అంకితం చేసి అమరుడైన గొప్ప వ్యక్తని కొనియాడారు. సాయుధ పోరాటానికి ముందు కారాగార శిక్షలు అనుభవించాడని, 1969, ఆగష్టు 26వ తేదీన గుండెపోటుతో దిల్లీలో చనిపోయాడని తెలిపారు. ఆయన పేరిట హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో సీపీఐ రాష్ట్ర కార్యాలయాన్ని మఖ్దూం భవన్ నిర్మించారన్నారు. నేటి యువత ఆయన ఆశయ సాధన కోసం ముందుండి పోరాడాలన్నారు.