Y Category Security to MP Dharmapuri Arvind :తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి గెలుపొంది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా... మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ జనాకర్షణను పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నేతల మధ్య ఆరోపణలు-ప్రతిఆరోపణలు తీవ్ర స్థాయిలో పేలుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని నేతల భద్రత విషయంలోను పార్టీలు ఆచితూచి వ్యవహారిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నేతలకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
MP Arvind Y Category Security :అందులో భాగంగానే తెలంగాణలో ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ వై, వై ప్లస్ భద్రతను కేటాయించింది. బీఆర్ఎస్ సర్కారును ఢీకొట్టే అత్యంత బలమైన నేతలు.. దీటుగా ప్రశ్నించే నాయకులకు ఫ్రీ హ్యాండ్ కల్పించనుంది. అందులో ఒకరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్‌కు 8 మందితో వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐబీ బృందంతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత వివరాలతో పాటు ఎంపీ అర్వింద్‌కు సంబంధించిన కార్యాలయం, నివాసం పరిసర ప్రాంతాల ఫోటోలను సేకరించారు.