TU VC Ravinder Comments on EC Naveen Mittal : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో వీసీ వర్సెస్ ఈసీ అన్నట్లుగా సాగుతున్న వివాదం మరింత ముదిరింది. గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. తాజాగా విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్‌పై తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ప్రశాంతంగా ఉన్న టీయూలో నవీన్ మిత్తల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
రుసా నిధులు ఇవ్వకుండా మిత్తల్ అడ్డుకుంటున్నారు :వర్సిటీ రిజిస్ట్రార్‌గా తాను చెప్పిన వ్యక్తే ఉండాలని నవీన్ మిత్తల్ కోరుకుంటున్నారని వీసీ రవీందర్ గుప్తా ప్రకటనలో పేర్కొన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకే తనపై అవినీతి ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. బ్యాక్ డోర్ పద్దతితో తన పరువు తీయాలని మిత్తల్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీకి రావాల్సిన రూ.20 కోట్ల రుసా నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.
ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం :తెలంగాణ యూనివర్సిటీ రోజువారీ పరిపాలనలో మిత్తల్ జోక్యం చేసుకుంటూ.. తనను, యూనివర్సిటీ పాలనను అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని వీసీ రవీందర్ గుప్తా తెలిపారు. నవీన్ మిత్తల్ జోక్యంపై సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి స్పందించాలని వీసీ కోరారు. టీయూలో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. ఆరోపణలపై ఏ ఏజెన్సీ ద్వారా అయినా.. ఎలాంటి న్యాయ విచారణకైనా తాను సిద్ధం అని టీయూ వీసీ రవీందర్ గుప్తా స్పష్టం చేశారు.
పాలకమండలి సమావేశానికి హాజరుకాని వీసీ, రిజిస్ట్రార్ :మరోవైపు ఇవాళ హైదరాబాద్‌లోని రూసా భవనంలో 10 మంది ఈసీ సభ్యులతో తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా, నూతన రిజిస్ట్రార్ నిర్మలా దేవి హాజరుకాలేదు. తమకు ఎలాంటి సమాచారం అందలేదని వీసీ, రిజిస్ట్రార్ తెలిపారు. ఏప్రిల్ 19న జరిగిన పాలక మండలి సమావేశం నిర్ణయాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో.. ఈసీ ఛైర్మన్ లేకుండా ఏ సమావేశం జరిగినా.. అది చెల్లుబాటు కాదని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా స్పష్టం చేశారు. హైకోర్టు స్టే ఉన్నా గానీ సమావేశం ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని వీసీ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: