Bank Theft Investigation: నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. దొంగలు ఒక్క ఆధారం వదలకుండా జాగ్రత్తపడ్డారు. రెండు వారాల కిందటే రెక్కీ నిర్వహించి.. సీసీ కెమెరాలు లేని మార్గంలో బ్యాంకులోకి ప్రవేశించారు. కెమెరాల ధ్వంసం మొదలుకుని.. ఎలక్ట్రానిక్ అలారం తొలగించడం వరకు ప్రణాళిక ప్రకారం చేశారు. ఎక్కడా వేలిముద్రలు పడకుండా.. సర్జికల్ గ్లౌజ్, వాటిపై మరో గ్లౌజ్ ధరించినట్లు తెలుస్తోంది. వాహనం ఊరు వెనకాల నీటి ట్యాంకు వద్ద నిలిపి రావటం చూస్తే.. దొంగలు పక్కా పన్నాగంతోనే వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
బుస్సాపూర్ గ్రామానికి ఓ వైపు ఇళ్లు లేని ప్రాంతంలో... ఓ భవనం మొదటి అంతస్తులో బ్యాంకు ఉంది. బ్యాంకు ముందు నుంచి వస్తే సీసీ కెమెరాలకు చిక్కే అవకాశం ఉంటుందని దొంగలు భావించారు. అందుకు ఎవరి కంటపడకుండా జాగ్రత్త తీసుకున్నారు. పక్కనే ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణలోని ట్రాక్టర్ ఇనుప గొర్రు చక్రాలు.. ఒకదానిపై ఒకటి పేర్చుకొని బ్యాంకు మెట్లపైకి చేరారు. నలుగురి కంటే ఎక్కువ మంది చోరీలో పాలుపంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.