నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని రణంపల్లికి చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు (51) కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్స్‌లో మానసిక వైద్యవిద్యనభ్యసించారు. 25 ఏళ్లుగా అక్కడే వైద్యసేవలందిస్తున్న ఆయన ప్రస్తుతం లండన్ సమీపంలోని న్యూబెర్రీలో మానసిక వైద్యశాలకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో డాక్టర్ శేషగిరిరావుతో పాటు ఆయన భార్య హేమ(47)కు కూడా కరోనా సోకగా, ఎట్టకేలకు బయటపడ్డారు. వారు వ్యాధిని జయించిన వైనంపై డాక్టర్ శేషగిరిరావుతో ఫోన్లో ‘ఈనాడు’ చేసిన ముఖాముఖి విశేషాలివి.
మీకు కరోనా సోకినట్లు ఎలా తెలిసింది?
నా భార్య మార్చి 13న పాఠశాల నుంచి పిల్లలను తీసుకురావడానికి వెళ్లింది. అక్కడి నుంచే ఫోన్ చేసి.. ‘చేయి కూడా లేపలేకపోతున్నాను. ఈ స్థాయిలో ఒళ్లు నొప్పులు ఎప్పుడూ రాలేదు’ అని చెప్పింది. ఎలాగోలా కష్టపడి తానే ఇంటికొచ్చింది. మరుసటి రోజు ఆమెకు దగ్గు మొదలైంది. మూడో రోజుకు బాగా పెరిగింది. ఆకలి తగ్గింది. నోరంతా చేదుగా ఉందని చెప్పేది. నాలుగో రోజు జ్వరం మొదలైంది. ఆమెకు కరోనా సోకిందని 16వ తేదీన పూర్తిగా అర్థమైంది. ఫలితంగా నేనే చికిత్స ప్రారంభించాను. 3,4 రోజుల తర్వాత నాకు కూడా దగ్గుతో లక్షణాలు మొదలయ్యాయి. తర్వాత జ్వరం రావడం వల్ల నేనూ వైరస్ బారిన పడ్డానని నిర్ధారణ అయ్యింది.
ఇద్దరికీ కరోనా సోకిందని తెలియగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఇక్కడ పరిస్థితి మరీ తీవ్రమైతే తప్ప ఆసుపత్రికి రావద్దనే నిబంధనలున్నాయి. వైరస్ సోకినా ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. నేను వైద్యుడినే కనుక, జాగ్రత్తలు తీసుకున్నాను. పిల్లలు ఒక గదిలో.. మేమిద్దం మరో గదిలో ఉన్నాం. వాళ్ల పని వాళ్లు చేసుకోవడంతో పాటు మాకూ అవసరమైనవి చేసి పెట్టేవారు. కరోనా వైరస్ ప్రభావం మాపై తీవ్రంగా పడినా, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా బయటపడటం అదృష్టమనే చెప్పాలి.
చికిత్స ఎలా తీసుకున్నారు?
రోజూ ఒక్కోలా ఉండేది. పొద్దున్న లేవగానే తగ్గిందని అనుకోవడం. మళ్లీ మధ్యాహ్నానికి జ్వరం పెరగడం. మందులేసుకుంటే తగ్గిపోవడం.. ఇలా విపరీతమైన మార్పులుండేవి. 100-102-103 డిగ్రీల వరకూ జ్వరం వస్తుండేది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పారాసిటమాల్ మాత్ర వేసుకునేవాళ్లం. జ్వరం, దగ్గు.. ఒక్కో రోజు ఒక్కో తీవ్రతలో కనిపించేవి. మా ఆవిడకు మధుమేహం, అధిక రక్తపోటు కూడా ఉన్నాయి. తను హైరిస్క్ కేటగిరీలో ఉంది. 14 రోజుల్లో నేను 4 కిలోలు, ఆమె 5 కిలోల బరువు తగ్గిపోయాం. ఆకలి చచ్చిపోయింది. అయినా శక్తి కోసం ఏదో ఒకటి తినేవాళ్లం. దగ్గుకు సిరప్ తాగేవాళ్లం. కరోనాతో పాటు ఇంకేదైనా ఇన్‌ఫెక్షన్ వచ్చిందేమోనన్న అనుమానంతో.. అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ఔషధాన్ని అయిదు రోజుల పాటు వేసుకున్నాం. నా భార్య బీపీ, షుగర్‌కు వాడే మందులను ఆపలేదు. ఆమెకు రక్తంలో చక్కెర స్థాయి కొంత తగ్గడంతో ఇన్సులిన్ మోతాదులు మార్చాను. అయితే మాకిద్దరికీ న్యుమోనియా రాలేదు.