సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది రెడిమేడ్ పిండి పదార్థాలపై ఆధారపడుతున్నారు. పదేళ్ల కింద వరకు అంతా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సంక్రాంతి పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. చెకోడీలు, మురుకులు, అరిసెలు, గవ్వలు, లడ్డులు, సకినాలు, గరిజెలు... ఇలా 20 వరకు పిండి వంటలు తయారు చేస్తున్నారు.
మహిళలకు ఉపాధి కేంద్రాలు..
నగర ప్రాంతాల్లో ఎక్కువ మహిళలు ఉద్యోగాలు చేస్తుండటం, అందరికీ అన్ని పిండి వంటలు రాకపోవడం వల్లే తయారీ కేంద్రాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమగా మారిపోయాయి. నిజామాబాద్ నగరంలోనే దాదాపు 20 వరకు పిండి వంటల తయారీ కేంద్రాలు ఉండగా ఒక్కో దాంట్లో 10 నుంచి 15 మంది వరకు మహిళలు పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50వరకు ఈ కేంద్రాలు ఉంటాయి. ఏడాది పొడవునా ఈ కేంద్రాల్లో మహిళలకు ఉపాధి లభిస్తోంది. శుభకార్యాలు, సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా ఆర్డర్లు వస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఒక్కో కేంద్రంలో ఐదు నుంచి పది మందికి అధికంగా ఉపాధి లభిస్తోంది. ప్రతి రోజూ రూ.300 నుంచి రూ.500 వరకు వీరికి కూలీ లభిస్తోంది. దీంతో మహిళలు తమ కుటుంబాలకు అదనపు ఆదాయం అందించగలుగుతున్నారు.
ఇందూరు నుంచి విదేశాలకు..
నిజామాబాద్ జిల్లా నుంచి అనేక మంది దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్నారు. దీంతో ఇందూరు నుంచి బంధువులు, కుటుంబ సభ్యుల కోసం అనేక మంది పిండి వంటలను పంపిస్తున్నారు. ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, దుబాయ్ తోపాటు ఇతర దేశాలకూ ఇందూరు నుంచి పిండి వంటలు వెళ్తున్నాయి. ఆయా దేశాల్లో ఉన్న తమ బంధువులు, కుటుంబ సభ్యులు సైతం పిండి వంటలతో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇందుకోసం కొరియర్ సంస్థలు ఆరు కిలోల బరువుకు రూ.800నుంచి రూ.1200వరకు రుసుము వసూలు చేస్తున్నాయి. అందుబాటు ధరలో తయారీ ప్రయాస లేకుండా రెడిమేడ్గా పదార్థాలు లభిస్తుండటం పట్ల కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.