తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాం​సాగర్‌ చెంత మదిని దోచే ప్రకృతి సోయగాలు.. - శ్రీరాంసాగర్​ చెంత మది దోచే అందాలు

చుట్టూ ప్రకృతి సోయగాలు. నడుమ గోదావరి గలగలలు. పచ్చనిగడ్డిలో చెంగుచెంగు మంటూ దూకే జింకలు. పక్షుల కిలకిలలు. పురివిప్పి నాట్యమాడే నెమళ్లు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి తీరాన కనిపిస్తున్న సుందర దృశ్యాలు.. చూపరులను కనువిందు చేస్తున్నాయి. శ్రీరాంసాగర్ చెంత మదిని దోచేస్తున్న ప్రకృతి అందాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

special story on beauty of nature in nizamabad
శ్రీరాం​సాగర్‌ చెంత మదిని దోచే ప్రకృతి సోయగాలు..

By

Published : Jul 3, 2020, 8:10 AM IST

Updated : Jul 3, 2020, 8:47 AM IST

జింకలు, విదేశీ పక్షులు, నెమళ్లతో సందడిగా మారిన ఈ ప్రాంతం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని గోదావరి పరివాహకం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన వన్యప్రాణుల సందడి అందరినీ అలరిస్తోంది. నందిపేట మండలంలోని నడుకుడ, చిన్నయానాం, డొంకేశ్వర్, నూత్ పల్లి, గాదేపల్లి గ్రామాల్లో... గోదావరి తీరంలో జింకలు, విదేశీ పక్షుల విహరిస్తున్నాయి.

1500 వరకు జింకలు

కొన్నేళ్లుగా శ్రీరాంసాగర్ పూర్తిస్థాయిలో నిండకపోవటం వల్ల పరివాహక ప్రాంతమంతా గడ్డితో పచ్చగా మారుతోంది. గడ్డి లభ్యత ఎక్కువగా ఉంటున్నందున జింకల సంఖ్య సైతం పెరిగిపోయింది. ఎన్నడూ లేని విధంగా దాదాపు 1500వరకు జింకలు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. మందలు మందలుగా చెంగు చెంగున దూకుతూ... జింకలు పెట్టే పరుగులు చూపరులను కట్టి పడేస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో గోదావరి, మంజీరా నదులు ప్రవహిస్తాయి. ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో జింకల దండు ఎక్కువగా కనిపిస్తోంది. ఏ కాలంలోనైనా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వన్యప్రాణులకు నీరు పుష్కలంగా లభిస్తుంది. జింకలు క్రమంగా ఎస్​ఆర్​ఎస్పీ పరివాహకానికి చేరుకుని తమ సంఖ్యను వృద్ధి చేసుకున్నాయి. ఏటేటా పెరుగుతూ ప్రస్తుతం... ఆ సంఖ్య 1500 దాటింది.

పచ్చని ప్రకృతి సోయగాలు

గోదావరి తీరం సాధారణంగానే సుందరంగా కనిపిస్తుంది. జల సవ్వడికి తోడు పక్షుల కిలకిలరాగాలు, పచ్చని ప్రకృతి సోయగాలు సందర్శకులను ఇట్టే కట్టి పడేస్తుంటాయి. ఈ ప్రకృతి సోయగానికి వన్యప్రాణులు, జింకల సందడి, విదేశీ పక్షులు... మరింత అందాన్ని అద్దుతున్నాయి. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన ఫ్లెమింగో, ఫెలికాన్ పక్షులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెనుక జలాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అద్భుత దృశ్యాలు

స్థానికంగా ఉండే బాతులు, కొంగలు గోదావరి తీరంలో సేద తీరుతున్నాయి. వర్షం కురిసినప్పుడు, ఉదయం, సాయంత్రం వేళల్లో నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. ఇలాంటి అద్భుత దృశ్యాలన్నీ ఒకే చోట కనువిందు చేస్తుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జింకలు, వలస పక్షులను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.

సాధారణ జింకలు, నెమళ్లు అటవీ ప్రాంతంలో అన్ని చోట్లా ఉంటాయి. అయితే పెద్ద సంఖ్యలో ఉండటంతో శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంది. జింకల మందల్లో కృష్ణ జింకలు ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ఇవి రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయని కానీ.. నిజామాబాద్ జిల్లాలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందని అటవీ అధికారులు చెబుతున్నారు.

ఇది చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

Last Updated : Jul 3, 2020, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details