తెలంగాణ

telangana

ETV Bharat / state

sirnapalli waterfalls : వీకెండ్​ స్పాట్​గా సిర్నాపల్లి వాటర్​ఫాల్స్ .. క్యూ కడుతున్న నేచర్​ లవర్స్ - best weekend spot in nizamabad

చుట్టూ దట్టమైన అడవులు... అప్పుడప్పుడు చెవులను తాకే రైలు కూతలు.. 40 అడుగుల ఎత్తు అలుగు నుంచి పడుతున్న జల సవ్వడులు.. ప్రకృతి రమణీయతను చాటే ఈ దృశ్యాలు చూసిన వారెవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఈ అనుభూతి పొందాలంటే నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి(sirnapalli waterfalls)కి వెళ్లాల్సిందే. గత రెండేళ్లుగా జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ జలపరవళ్లు జలపాతాన్ని తలపిస్తున్నాయి. వీకెండ్ స్పాట్​గా ప్రకృతి ప్రేమికులను పలకరిస్తోంది ఈ ప్రాంతం(sirnapalli waterfalls).

వీకెండ్​ స్పాట్​గా సిర్నాపల్లి వాటర్​ఫాల్స్
వీకెండ్​ స్పాట్​గా సిర్నాపల్లి వాటర్​ఫాల్స్

By

Published : Sep 19, 2021, 5:19 PM IST

వీకెండ్​ స్పాట్​గా సిర్నాపల్లి వాటర్​ఫాల్స్

లేచిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగులు. క్షణం తీరిక లేని జీవితాలు. కాస్త సేదతీరాలనుకుంటే చుట్టూ కాంక్రీటు ప్రపంచమే. ఈ బిజీ లైఫ్​లో.... ప్రకృతి ఒడిలో.. చల్లని గాలులు చెంపను తాకుతుంటే.. పక్షుల కిలకిలరావాలు చెవుల్లో తేనె పోసినట్టుగా హాయిని పంచుతుంటే.. కాసేపు కుటుంబంతోనో.. స్నేహితులతోనో గడపాలని అనుకోనివారుండరు. చదువులు, ఉద్యోగాలతో తీరికలేని జీవితాలు గడుపుతున్న నేటి తరానికి వీకెండ్​ వస్తే అదో హాయి. అందుకే శుక్రవారం రాగానే బ్యాగ్ సర్దేస్తున్నారు. ఓ గుట్టుకో.. చెట్టుకో.. పుట్టల చుట్టూ తిరగడానికి బయల్దేరుతున్నారు.

ఆహ్లాదం పంచే సిర్నాపల్లి..

అలా ప్రకృతి ఒడిలో పులకరించాలనుకునే వారికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి(sirnapalli waterfalls) స్వాగతం పలుకుతోంది. సిర్నాపల్లిలోని జానకీబాయి చెరువు నుంచి పారుతున్న అలుగు జలపాతాన్ని తలపిస్తోంది. 40 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న జలపరవళ్లు.. చుట్టూ పచ్చదనం.. పక్షుల కిలకిలరావాలు.. పైరగాలులలతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదాన్ని పంచుతోంది.

జానకీబాయి చెరువు..

తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన సిర్నాపల్లి సంస్థానంలో స్వర్ణ యుగంగా భావించిన రాణి జానకీబాయి పాలనలో నిర్మించిన చెరువులు, కోటలు ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అందులో మూడేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన జానకీబాయి చెరువు అలుగు నుంచి పడుతున్న జలపరవళ్ల(sirnapalli waterfalls)లో తడిసి ముద్దయేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.

జలపరవళ్లు..

జిల్లా కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామానికి.. మూడు కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలో నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లోని ఆరు చెరువులను నింపడానికి సుమారు రెండు వందల ఏళ్లకు పూర్వం రాణి జానకీబాయి చెరువు తవ్వించారు. ఈ చెరువు అలుగు 100 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో రాతితో నిర్మించారు. చెరువు నిండి అలుగు(sirnapalli waterfalls) పారుతుంటే.. ఆ నీరంతా 40 అడుగుల ఎత్తునుంచి జలపాతం(sirnapalli waterfalls)లా పారుతూ.. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.

ప్రకృతిలో పులకరింత..

రెండేళ్లుగా కరోనా వల్ల పర్యాటకం నిలిచిపోవడంతో ఆ సమయాన్ని అధికారులు వినియోగించుకున్నారు. ఆ ప్రాంతాన్ని(sirnapalli waterfalls) పర్యాటకానికి అనుగుణంగా.. అన్ని వసతులు కల్పించారు. కట్ట నుంచి దిగడానికి మెట్లు.. అలుగుపైకి వెళ్లకుండా రక్షణ ఏర్పాటు చేశారు. గత మూణ్నెళ్ల నుంచి విస్తారంగా వానలు కురవడం వల్ల చెరువులు అలుగు పారుతూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

గుంతల దారి.. కాస్త ఇబ్బందే..

ఈ ప్రాంతాన్ని(sirnapalli waterfalls) మరింత అభివృద్ధి చేయడానికి పాలకవర్గం.. నాలుగు చక్రాల వాహనానికి రూ. 50, ద్విచక్ర వాహనానికి రూ.20 చొప్పున టోల్ వసూలు చేస్తోంది. ఇప్పటికే ఈ సీజన్​లో 1,300 కార్లు, 5,000 ద్విచక్ర వాహనాలు, 400 వరకు ఆటోల్లో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గ్రామం నుంచి చెరువు అలుగు వరకు మూడు కిలోమీటర్ల మట్టిరోడ్డు గుంతలమయంగా మారింది. వానలు కురిస్తే ఆ రహదారి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. పర్యాటకులను ఇబ్బందులు పెడుతోంది.

"ఈ ప్రాంతం చాలా హాయిగా ఉంది. వీకెండ్​ స్పాట్​గా మాకు ఇది బాగా నచ్చింది. ఇక నుంచి ఎప్పుడు టైం దొరికినా ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చే దారులు బాగాలేవు. వర్షం వస్తే బైక్ ఈజీగా స్కిడ్ అవుతుంది. ఈ ప్రాంతానికి రావాలంటే కొత్తగా వచ్చే వారు చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఎందుకంటే ఎలా వెళ్లాలో దారి తెలియదు. అందుకే మార్గం మధ్యలో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తే మొదటిసారిగా వచ్చే వారికి సులభంగా ఉంటుంది. అలాగే.. ఎలాగూ వాహనదారుల నుంచి టోల్ వసూల్ చేస్తున్నారు కాబట్టి.. రహదారులను బాగు చేయిస్తే.. ఇది మంచి పిక్నిక్ స్పాట్​గా మారుతుంది."

- పర్యాటకులు

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా.. మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. అందులో ముఖ్యమైంది.. మనకు మనం కాస్త సమయం కేటాయించుకోవడం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. కొవిడ్​ వల్ల ఆహారపుటలవాట్లలో ఎలాగు మార్పొలొచ్చాయి.. కాసేపు ప్రకృతితో మమేకమైతే మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగానూ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలు ఒత్తిడికి దూరమై.. హాయిగా కాసేపు సేద తీరడానికి ఇలాంటి వీకెండ్ స్పాట్లే బెటర్ ఆప్షన్. ఇంకెందుకు లేట్.. వచ్చే వీకెండ్​కి మీరూ సిర్నాపల్లికి వెళ్లండి.. హాయిగా ఎంజాయ్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details