Registrations without permissions in Nizamabad : ఈ నెల 1 నుంచి మార్కెట్ విలువల పెంపు నేపథ్యంలో గత నెల చివర్లో నిజామాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ సమయంలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్‌లలో ఇంఛార్జ్ సబ్ రిజిస్ట్రార్‌లుగా ఉన్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. నాలా ఫీజు చెల్లించని, అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్ల క్రయవిక్రయాలకు సేల్ డీడ్‌లు తయారు చేశారు. భూమి పంచుకున్నట్లు పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు. ధరణిలో వ్యవసాయ భూములుగా ఉన్న వాటిని ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇతరుల పేరు ఉన్నా పట్టించుకోకుండా సేల్ డీడ్ చేశారు. డాక్యుమెంట్‌లో చూపిన విస్తీర్ణానికి స్టాంపు రుసుము కట్టాల్సి ఉన్నా.... అందులో కొంత మేరకే చెల్లించిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా రకరకాలుగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.
అధికారులు సస్పెండ్
రిజిస్ట్రేషన్లలో జరుగుతున్న అక్రమాలపై పాలనాధికారి నారాయణరెడ్డి మొదటగా ఆ శాఖ కమిషనర్ శేషాద్రి దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తులో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ మధుసూదన్ రెడ్డి విచారణ చేసి అక్రమాలను గుర్తించారు. విచారణ జరిపి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామన్న కలెక్టర్ సి. నారాయణరెడ్డి... అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
నాలా సర్టిఫికెట్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేశారని మాకు తొలుత ఫిర్యాదులు వచ్చాయి. ఇందులోభాగంగా లోతుగా విచారణ జరుపుతున్నాం. నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న పదెకరాలు ఉన్న ప్రాంతంలో వేరే నంబర్లతో వంద గజాలు, 200 గజాలు హద్దులు లేకుండా డాక్యుమెంట్ క్రియేట్ చేయడం... ఆ పదెకరాలు వివాదంలోకి వెళ్లేవిధంగా ప్రయత్నిస్తున్నారని మాకు అనుమానం వస్తోంది. ఇది నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుపుతాం.