Revanth Reddy Padayatra: నాడు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను.. నేడు కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కొరకు ఉపయోగించుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇలా చేసిన వ్యక్తికి రెండుసార్లు అవకాశం ఇస్తే.. మరి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేడు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించి.. వరాలు కురిపించారు. నాడు పార్లమెంటు తలుపులు మూసేసి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా ఇచ్చిందని బీజేపీ విమర్శలు చేస్తే.. ఇచ్చినందుకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.
కొత్త సంవత్సరంతో కొత్త ప్రభుత్వం 2024 జనవరి1 నాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే 42 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందించామో.. 2024లో రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షలు ఉచితంగా ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పుడిస్తున్న రూ.2 లక్షలు కాకుండా.. రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల కోసం సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా దీపం పథకం పెట్టి రూ.400కే సిలిండర్, గ్యాస్ ఇచ్చారు. కానీ నేడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిలిండర్ ధర రూ.1200లకు చేరుకుందని ప్రకటించారు. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిలిండర్ను రూ.500లకే ఇస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్ రైతులు చెరుకు, పసుపును పండించి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. రైతుబంధు కింద రూ. 15000 ఇవ్వడమే కాదు. భూమిలేని నిరుపేదలకు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ. 12000 ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందన్నారు. ఇవి అన్నీ కావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని.. చివరిగా బైబై కేసీఆర్ అంటూ సమావేశాన్ని రేవంత్రెడ్డి ముగించారు.
గో బ్యాక్ రేవంత్రెడ్డి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు: రేవంత్ రెడ్డి పాదయాత్ర సభలో నల్ల జెండాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా నిరసన తెలిపారు. రేవంత్రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. ఆయన మాట్లాడుతున్న వాహనం వద్దకు రావడానికి ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకుని స్టేషన్కి తరలించారు. సభ ముగిసిన అనంతరం వారిని పోలీసులు విడిచిపెట్టారు. కాంగ్రెస్ శ్రేణులు అరెస్ట్ చేసిన వారిని ఎలా విడిచిపెడతారంటూ స్టేషన్లో బైఠాయించారు.
ఇవీ చదవండి: