Railway Over Bridge Works In Nizamabad: నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌లో "రైల్వే ఓవర్ బ్రిడ్జి" నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రజలు ఎదురు చూస్తున్న మాధవనగర్ ఆర్వోబీ పనులు వేగం పుంజుకున్నాయి. హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలో ఉండే రైల్వే గేట్ గుండా నిత్యం సుమారు 50రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. గేటు పడిన ప్రతిసారి ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు 10నిమిషాల నుంచి అరగంట వరకు వేచి చూడాల్సిందే. కొన్నిసార్లు అత్యవసర చికిత్సకు వెళ్లే అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వస్తోంది. అలాంటి క్లిష్టమైన రైల్వే గేట్‌పై ఎంపీ అర్వింద్ ప్రత్యేక చొరవ చూపి వంతెన పనులు ప్రారంభమైయ్యేలా చూశారు.
రెండేళ్ల కాల పరిమితితో వంతెన నిర్మాణం చేపట్టారు. ఒక కి.మీ. పొడువు, 150 అడుగుల వెడల్పుతో రైల్వే ట్రాక్ పై వంతెన నిర్మిస్తున్నారు. రూ. 90 కోట్ల నిధులతో పనులు చేపట్టగా కేంద్రం రూ.30 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు అందించింది. దీంతో నిత్యం నిర్విరామంగా పనులు సాగుతున్నాయి. పిల్లర్లు నిర్మిస్తూనే వంతెన నిర్మాణానికి అవసరమైన అడ్డుకట్ట సైతం సమాంతరంగా నిర్మిస్తున్నారు. తద్వారా పిల్లర్లు పూర్తయ్యే సరికి వంతెన నిర్మించేందుకు అవసరమైన అన్ని పనులనూ చేస్తున్నారు. దీంతో వాహనదారులకు, నగరవాసులకు ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం కల్పించనున్నారు.