తెలంగాణ

telangana

ETV Bharat / state

Picketing In Bodhan: ఇతర ప్రాంతాల నాయకులు బోధన్‌కు రావొద్దు: సీపీ నాగరాజు - నిజామాబాద్​లో పోలీసుల పహారా

నిజామాబాద్ జిల్లా బోధన్​లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శివాజీ విగ్రహం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ సీపీ నాగరాజు హెచ్చరించారు.

Picketing In Bodhan
బోధన్​లో పోలీసుల పికెట్

By

Published : Mar 21, 2022, 10:35 AM IST

Updated : Mar 21, 2022, 11:42 AM IST

ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్​ సీపీ నాగరాజు హెచ్చరించారు. ప్రస్తుతం బోధన్​లో 144 సెక్షన్​ అమల్లో ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నిన్న జరిగిన ఘటనను వ్యతిరేకిస్తూ భాజపా, విశ్వహిందూ పరిషత్ బంద్​ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

శివాజీ విగ్రహం

10 మందిపై నాన్‌బెయిల్ కేసులు: సీపీ

బోధన్‌లో పరిస్థితి అదుపులో ఉందని నిజామాబాద్‌ సీపీ నాగరాజు తెలిపారు. నిన్నటి ఘటనలో 10 మందిపై నాన్‌బెయిల్ కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి పొందలేదని ఆయన అన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా ఆందోళనకారులను గుర్తించామని సీపీ పేర్కొన్నారు. 170 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇతర ప్రాంతాల నాయకులు బోధన్‌కు రావొద్దని సీపీ నాగరాజు సూచించారు.

పట్టణంలో పోలీసుల పహారా

బోధన్​లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ సీపీ ఆదేశాలతో రాత్రి నుంచే కార్యకర్తలను ముందస్తుగా అదుపులో తీసుకున్నారు. పలు చోట్ల రోడ్లను మూసివేశారు. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలోనూ పోలీసులను మోహరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌తోపాటు కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా బయటి వ్యక్తులు బోధన్​కు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

బోధన్‌లో కొనసాగుతున్న బంద్!

బోధన్​లో భాజపా కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్​ను నిరసిస్తూ చేపట్టిన బంద్​ కొనసాగతోంది. శివాజీ విగ్రహం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే పోలీసులు మాత్రం బంద్‌కు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు. బలవంతంగా బంద్ చేయిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బోధన్‌లో 144 సెక్షన్ అమలు విధించారు. పట్టణంలో పికెటింగ్, భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బోధన్‌లో మాత్రం ఆర్టీసీ బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి.

ఇదీ చూడండి:

Last Updated : Mar 21, 2022, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details