తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగు, సాగు నీటి కొరతతో ప్రజల ఇబ్బందులు - telangana varthalu

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో తాగు, సాగు నీటికి ఇబ్బందులు తప్పడం లేదు. సిరికొండ, ఇందల్వాయి, ధర్పల్లి, భీమ్‌గల్ మండలాల్లో పంటలు వేసవికి ముందే ఎండిపోతున్నాయి. పులిమీద పుట్రలా మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణంలో అలసత్వంతో చాలా గ్రామాలకు తాగునీరు దరి చేరడం లేదు.

తాగు, సాగు నీటి కొరతతో ప్రజల ఇబ్బందులు
తాగు, సాగు నీటి కొరతతో ప్రజల ఇబ్బందులు

By

Published : Mar 26, 2021, 5:12 AM IST

ఎండాకాలం రాకముందే ఆ గ్రామాల్లో తాగు, సాగు నీటికి కొరత ఏర్పడుతోంది. చాలా ప్రాంతాల్లో పంటను కాపాడుకునేందుకు బోర్లు వేయడం, ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధికారుల సమన్వయ లోపంతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో పొలాల దగ్గరికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. అసలే పంటకు నీరందక ఇబ్బంది పడుతున్న రైతులు నీటికోసం బోర్ల వద్దకు రానీయడం లేదు. ఇంకా పలు గ్రామాల్లో మిషన్‌ భగీరథ అంతర్గత పైప్‌లైన్ నిర్మాణం అసంపూర్తిగానే వదిలేయడం వల్ల సింగిల్ ఫేజ్ బోర్లపైనే ఆధారపడాల్సి వస్తుందని వాపోతున్నారు.

తాగునీటి ఇబ్బందులతో సతమతం

ఇందల్వాయి మండలం వెంగల్‌పాడులో తాగునీటి ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇక్కడ ఆలయం వెనక, ముందు తండాలను కలిపి గతంలో గ్రామపంచాయతీగా మార్చారు. మిషన్ భగీరథ పథకం ప్రారంభంలో సర్వే నిర్వహించిన అధికారులు నూతన ట్యాంకు నిర్మాణం చేపట్టలేదు. అక్కడ కేవలం 40 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు మాత్రమే ఉండడంతో నీటి అవసరాలు తీరడం లేదు. నీటి కోసమే రోజు మొత్తం గడిచిపోతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.

నీటి వసతి కల్పించాలని విజ్ఞప్తి

ఎండ తీవ్రత పెరగడంతో అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీటిని ఇంటింటికి అందించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీస నీటి అవసరాలు తీర్చి తమ గోడును ఆలకించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: డీపీఆర్ లేకుండానే కాళేశ్వరానికి అనుమతులొచ్చాయా?: హరీశ్​

ABOUT THE AUTHOR

...view details