తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో వేడెక్కిన రాజకీయం.. అర్వింద్​ వర్సెస్​ జీవన్​ రెడ్డి - ఎంపీ అర్వింద్ వార్తలు

MP Arvind vs MLA Jeevam Reddy : నిజామాబాద్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెరాస, భాజపాల మధ్య మాటకు మాట, వాదోపవాదాలు దాటి ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలే దాడులు చేయండంటూ చెబుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది. ఇప్పటికే మూడు సార్లు ఇరు పార్టీల మధ్య దాడులు జరగ్గా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందూరు జిల్లాలో తాజా రాజకీయాలపై ప్రత్యేక కథనం.

arvind vs jeevam reddy
arvind vs jeevam reddy

By

Published : Feb 22, 2022, 5:17 PM IST

MP Arvind vs MLA Jeevam Reddy : నిజామాబాద్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తెరాస, భాజపాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా పరిస్థితి ఉంది. మెున్నటివరకు ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు కొనసాగాయి. ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. వరుసగా మూడు సార్లు ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.

పరస్పరం రాళ్లదాడి

ఇటీవల నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన అర్వింద్‌ను తెరాస కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలంలో పర్యటించే క్రమంలోనూ కాన్వాయిపై దాడి జరిగింది. అర్వింద్ వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ గొడవ చివరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి చేరింది. తాజాగా మరోసారి ధర్పల్లిలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఘటనలో కార్యకర్తలతోపాటు పోలీసులకు గాయాలయ్యాయి.

దాడులు చేయాలంటూ

కేసీఆర్, కేటీఆర్‌లపై అర్వింద్‌ మెుదట్నుంచి విమర్శలు ఎక్కుపెట్టారు. జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డికి పలు సందర్భాల్లో సవాళ్లు విసిరారు. అదేస్థాయిలో మంత్రి దీటుగా స్పందించారు. ఇక అర్వింద్ తన నివాసాన్ని ఆర్మూర్‌ కేంద్రానికి మార్చడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అర్వింద్ అక్కడ్నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో... జీవన్‌రెడ్డితో వివాదం మెుదలైంది. చివరకు ఒకరిపై ఒకరు దాడులు చేసేంత వరకు చేరుకుంది. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో దాడులు చేయాలంటూ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఆ స్థాయిలోనే సమాధానం చెబుతామని అర్వింద్‌ బదులిచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ... జిల్లాలో ఎన్నడూ లేని విధంగా పార్టీల మధ్య దాడులు జరుగుతుండటం సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి :ఎంపీ అర్వింద్​ పర్యటనలో.. భాజపా కార్యకర్తలపై కత్తులతో దాడి

'నిజంగానే దాడికి పిలుపునిస్తే అర్వింద్ తిరిగి రాగలడా..?'

ABOUT THE AUTHOR

...view details