Dilapidated archaeological exhibition hall: ఇది నిజామాబాద్ తిలక్ గార్డెన్‌లో జిల్లా పురావస్తు ప్రదర్శనశాల..! ఇక్కడ ఒక ప్రదర్శనశాల ఉందనే విషయాన్ని జిల్లా యంత్రాంగం ఎప్పుడో మరిచిపోయినట్లు ఉందీ పరిస్థితి.. పిచ్చిమొక్కలతో.. పున:ప్రారంభం కాకముందే మళ్లీ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఫలితంగా నేటి బాలలకు జిల్లా చరిత్ర తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది.
ఇందూరు ఉత్సవాల సందర్భంగా 2001లో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ నిజామాబాద్ తిలక్ గార్డెన్‌లో జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఇందుకోసం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న శిల్పాలు, శిలాశాసనాలు, విశేష ప్రాచుర్యం పొందిన తాళపత్ర గ్రంథాలు, నాణేలు సేకరించి ప్రదర్శనగా ఉంచారు. వారంలో ఒకరోజు ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా చూసే అవకాశం కల్పించారు. పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యం కల్పించారు. ఐతే పురాతన భవనం కావడంతో వర్షాకాలంలో గోడలపై నుంచి నీరు ధారలుగా కారుతూ అపురూపగ్రంథాలు, ఆభరణాలు చెడిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో 2012 నుంచి 2014 వరకు మూసి ఉంచారు. ఈ సమస్యపై కథనాలు రావడంతో స్పందించిన ఉన్నతాధికారులు మరమ్మతులు చేయించారు.