MP Arvind reacted to the yellow flexi set up in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుపై వెలసిన ఫ్లెక్సీలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. జిల్లాలో వేరు వేరు చోట్ల పసుపు రంగు హోర్డింగ్లు ఏర్పాటు చేసి ఇదే ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అని రాశారు. ఈ ఫ్లెక్సీలపై అర్వింద్ ఒక వీడియో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అర్వింద్ అన్నారు.
పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు గురించి అడిగినప్పుడు.. దేశంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్లో స్పైస్ బోర్డు ఏర్పాటు చేసి రూ 30కోట్లు కేటాయించినట్లు కేంద్రం బదులిచ్చిందని తెలిపారు. పసుపు ధర పడిపోయినప్పడు.. బీజేపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయలేదని విమర్శించారు.
మహారాష్ట్రలో పసుపు విస్తీర్ణం బాగా పెరుగుతోందని.. మహారాష్ట్ర కంటే తెలంగాణలో కూలీల ఖర్చు అధికంగా ఉందని దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టాలన్నారు. తాము కూడా బీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని.. కేసీఅర్ తట్టుకోలేరని చెప్పారు.