తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో మధ్యాహ్న భోజన కార్మికుల అవస్థలు

కరోనా కారణంగా దాదాపు పది నెలలు పాఠశాలలు మూతపడటంతో మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోయారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగినా.. ప్రభుత్వం రేట్లు పెంచడం లేదని చెబుతున్నారు. కొవిడ్​ కాలానికి గౌరవ వేతనం అందించటంతో పాటు స్లాబ్ రేట్లు పెంచాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బకాయి డబ్బులు చేతికందక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

midday meals workers suffering with Arrears in nizamabad
నిజామాబాద్​లో మధ్యాహ్న భోజన కార్మికుల అవస్థలు

By

Published : Feb 5, 2021, 4:36 PM IST

నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు అవస్థలు పడుతున్నారు. బకాయిలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లోనే రెండు మూడు నెలలకోసారి బిల్లులు చెల్లిస్తారు. గత 2019డిసెంబర్ నుంచి 2020 మార్చి వరకు బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. దాదాపు రూ.3 కోట్ల వరకు బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. అందులో గుడ్డు బకాయిలే అధికంగా ఉన్నాయి. వారంలో నాలుగు రోజులు భోజనంలో గుడ్డు వడ్డిస్తున్నారు. ఇవే రూ.3కోట్లు దాటుతున్నాయి. వీటితోపాటు భోజన బిల్లులు పూర్తయినా.. ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. ఇవి కాకుండా కార్మికులకు గౌరవ వేతనంగా అందించే రూ.వెయ్యి కూడా 2020 ఫిబ్రవరి, మార్చి నెలలకు ఇవ్వాల్సి ఉంది.

గుడ్డుకు నాలుగు రూపాయలే

జిల్లాలో మొత్తం 1,200 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,283 కార్మికులు పని చేస్తున్నారు. మొత్తం 1200 పాఠశాలలు ఉండగా.. ప్రాథమిక పాఠశాలలు 783, ప్రాథమికోన్నత పాఠశాలలు 141, ఉన్నత పాఠశాలలు 276 ఉండగా.. వీటి పరిధిలో మొత్తం 1,19,466 విద్యార్థులున్నారు. ప్రాథమిక పాఠశాల్లో ఒక విద్యార్థికి రూ.4.97లు, ప్రాథమికోన్నత పాఠశాల్లో రూ.7.45, ఉన్నత పాఠశాలో గుడ్డుతో కలిపి రూ. 9.45 విద్యార్థులకు చెల్లిస్తారు. ఒక గుడ్డుకు ప్రభుత్వం రూ.4 చొప్పున ఒక విద్యార్థికి చెల్లిస్తుంది. కానీ మార్కెట్లో రూ.6 పలుకుతోంది. మిగిలిన రూ.2ను కార్మికులు నష్టపోతున్నారు.

అప్పుచేసి వంట

మధ్యాహ్న భోజన పథకంలో కార్మికులు భోజనం ఖర్చులను ముందే భరించాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు ప్రకారం బిల్లులను రెండు మూడు నెలలకోసారి చెల్లిస్తారు. బియ్యం మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కూరగాయలు, ఉప్పు పప్పులు, పోపు దినుసులు, నూనె, గ్యాస్ వంటివి కార్మికులే భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి నెలా కార్మికులు అప్పులు తెచ్చి వంట చేసి పిల్లలకు అందిస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. అయితే 2019 డిసెంబర్ నుంచి పాఠశాలలు మూత పడే మార్చి సమయానికి బిల్లులు అందలేదు. దీంతో అప్పటి వరకు చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి. వీటికి వడ్డీలు కట్టలేక, కరోనా కారణంగా ఉపాధి లేక కార్మికులు నానా అవస్థలు పడ్డారు. పాఠశాలలో విద్యార్థుల కడుపు నింపిన చేతులతోనే సొంత పిల్లల కడుపు మాడ్చాల్సిన దుస్థితిని అనుభవించారు.

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు

రోజురోజుకూ మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నూనెలు చేతికి అందకుండా పోతున్నాయి. వంట గ్యాస్, కూరగాయలు అధిక ధరలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం విధించిన స్లాబ్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీంతో పెరిగిన ధరలను కార్మికులే భరించాల్సి వస్తోంది. తద్వారా ప్రతి నెలా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌష్ఠిక ఆహారం అందించడంతోపాటు ఏమాత్రం నాణ్యతలో తేడా వచ్చినా అధికారుల నుంచి ఒత్తిళ్లు తప్పడం లేదు. ఇంత చేస్తున్నా ప్రమాద బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలకూ కార్మికులు నోచుకోవడం లేదు.

చాలా పాఠశాలల్లో కిచెన్ షెడ్లు లేవు

ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసేందుకు సరైన వసతులు లేవు. చాలా పాఠశాలల్లో కిచెన్ షెడ్లు లేవు. ఆరుబయటే కార్మికులు వంట చేసి పెడతారు. అనేక పాఠశాలల్లో వంట గ్యాస్ సౌకర్యం లేక.. కట్టెల పొయ్యి మీద వండి వడ్డిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభంలో పాఠశాలలకు వంట పాత్రలు అందించారు. ఇప్పటికీ వాటి పైనే వంట చేస్తున్నారు. అనేక పాత్రలు దెబ్బతిని పనికి రాకుండా పోయినా వాటి స్థానంలో కొత్తవి అందించడం లేదని కార్మికులు చెబుతున్నారు. తమకు వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:'పసుపు ఎగుమతులు పెంచుతున్నాం.. ధర పెరుగుతుంది'

ABOUT THE AUTHOR

...view details