నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ డివిజన్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఉన్నతాధికారులు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించారు. విధుల్లో కానీ, ఇతర సమయాల్లో కానీ వారికి ప్రమాదాలు జరిగితే ఈ బీమా వర్తిస్తుందని ఏసీపీ రామారావు తెలిపారు. లబ్ధిదారులకు ఆయన ఇన్సూరెన్స్ పత్రాలు అందజేశారు. ప్రమాదం జరిగితే లక్ష రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 4 లక్షలు.. కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము అందుతుందని పేర్కొన్నారు.
బోధన్ సబ్ డివిజన్ హోం గార్డులకు ప్రమాద బీమా
హోం గార్డులకు ప్రమాద బీమా బాధ్యతలు తీసుకొని బోధన్ సబ్ డివిజన్ ఉన్నతాధికారులు మానవత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఆరోగ్య బీమా ఉండదని.. హోంగార్డుల జీతభత్యాలు, కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏసీపీ రామారావు తెలిపారు.
కుటుంబ శ్రేయస్సు కోసం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానిస్టేబుళ్లు, ఆపై స్థాయి వారికి మాత్రమే ఆరోగ్య బీమా ఉందని.. హోం గార్డులకు లేదని ఏసీపీ వెల్లడించారు. వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే బోధన్ సబ్ డివిజన్‌లో పనిచేస్తున్న వారందరికీ బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీఐలు, ఎస్సైలు వారికి ఇన్సూరెన్స్ బాధ్యత తీసుకున్నట్లు వెల్లడించారు. ..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు హోంగార్డులు.. అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు రవీందర్ నాయక్, అశోక్ రెడ్డి, రామన్, ఎస్సైలు రవీందర్, అనీల్ రెడ్డి, సందీప్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:చదువుల తల్లి మురిసేలా.. నలుగురూ మెచ్చేలా.. ఆ ఊరి ప్రభుత్వ పాఠశాల.!