నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉప ఎన్నిక బరిలో ఎవరు ఉంటారనే అంశంపై ఉత్కంఠకు తెర పడింది. అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆర్ తనయ కవిత పేరును ఖరారు చేశారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత
రాజ్యసభ సీటు ఇవ్వకపోవటం వల్ల తెరాస నేత కవిత రాజకీయ భవిష్యత్తు ఏమిటనే దానిపై గులాబీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఆమెను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. మంగళవారం విస్తృత స్థాయి సమాలోచనల అనంతరం సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించిన వెంటనే ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు.
2015లో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడటం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి ఇంకా 22 నెలల పదవీకాలం ఉంది. స్థానిక సంస్థల్లో ఓటు హక్కున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో 95 శాతానికి పైగా తెరాసకి చెందినవారే ఉండటంతో.. ఆ పార్టీ అభ్యర్థికే విజయావకాశాలున్నాయి.
నామినేషన్ ఉపసంహరణ...
నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కవిత పేరు ఖరారు కావటంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. ఈనెల 19 వరకు నామినేషన్ల గడువు ఉండగా.. పోటీ లేకుండా కవిత ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం