ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వాగులు పొంగి చెరువులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారంలోగా చాలా వరకు చెరువులు నిండే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తుంపల్లి, గడుకోల్ గ్రామాల వద్ద వాగు.. వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. ఇదే మండలంలోని రావుట్ల పరిధిలో ఎదుల్లా చెరువు నిండి అలుగు దూకుతోంది.
పూర్తిగా నీట మునిగిన శివాలయం
రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద త్రివేణి సంగమంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న నీటిప్రవాహంతో... నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది. నవీపేట మండలంలోని జన్నేపల్లి వాగు వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేల్పూర్ మండలంలోని పెద్ద చెరువు 30 ఏళ్ల తర్వాత నిండింది. డిచ్పల్లి మండలం సుద్దులం చెక్ డ్యామ్ అలుగు పారుతోంది. సిరికొండ మండలంలో చెరువులు అలుగు పారి రోడ్డుపైకి నీరు చేరింది. బీబీపేట మండలంలోని ఎడ్లకట్టవాగు, మానాల వాగు పొంగి పొర్లుతున్నాయి. మోర్తాడ్ మండలంలోని ముసలమ్మ చెరువు అలుగు పారుతోంది. నందిపేట మండలంలో వాగులు పొంగి పొర్లి... వెయ్యి ఎకరాల వరకు పంటలు నీట మునిగాయి. వేల్పూర్ మురుసుకుంట చెరువు అలుగు పోస్తుంది. అదే మండలంలోని పడిగెల గ్రామ నవాబ్ చెరువు నిండి పడిగెల-ఆర్మూర్ ప్రధాన రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.
చెరువులు నిండుతున్నాయ్..
జక్రాన్పల్లి మండల కేంద్రంలోని చెరువు నిండి అలుగు పోయడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. ధర్పల్లి మండలంలోని వాడి వాగు జలకళను సంతరించుకుంది. దీనిని చూసేందుకు స్థానికులు బారులు తీరారు. హోన్నజీపేట్ చెరువు కింద వరదనీటిలో దాదాపు 50 ఎకరాల పంట నీట మునిగింది. వరి నాట్లు పూర్తయిన వారంలోనే పంట నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇందల్వాయి మండలంలోని పెద్ద చెరువు, సిర్ణపల్లిలోని జానకి బాయ్ చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఇలాగే కొనసాగితే అలుగు పారే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.