నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన గుగులోతు గోపి, ధనలక్ష్మి దంపతుల కూతురు సౌమ్య. ప్రస్తుతం ఆమె బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. ఏడో తరగతిలో ఉన్న సమయంలో పాఠశాల స్థాయిలో జరిగే పరుగు పోటీల్లో మెరుపు వేగంతో దూసుకువెళ్లిన సౌమ్యను చూసి... స్థానిక ఫుట్‌బాల్ కోచ్ నాగరాజు... ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. సౌమ్యను ఫుట్‌బాల్ శిక్షణకు పంపిస్తే గొప్ప క్రీడాకారిణి అవుతుందని చెప్పారు. ‘అమ్మాయిలకు ఆటలు ఎందుకంటూ మొదట వాళ్లు నిరాకరించినా.. కోచ్ నచ్చజెప్పటంతో ఎట్టకేలకు ఒప్పుకున్నారు.
అండర్-14 జాతీయ జట్టుకు ఎంపిక
2015లోనే అండర్-14 జాతీయ జట్టుకు సౌమ్య ఎంపికైంది. అప్పటి నుంచి సీనియర్ జట్టులో స్థానం కోసం సౌమ్య పట్టుదలతో ప్రయత్నించింది. చైనాలో జరిగిన అండర్-16 పోటీల్లో అత్యధిక గోల్స్‌తో టాపర్‌గా నిలిచింది. తెలంగాణ ఉమెన్స్ లీగ్‌లోనూ ఆమే టాపర్. గత ఏడాది జాతీయ స్థాయి ఉమెన్స్ లీగ్‌లో ముంబయి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ క్యాంక్రి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 2018లో బ్రిక్స్ దేశాల మధ్య జరిగిన జూనియర్స్ మహిళా ఫుట్‌బాల్ పోటీల్లోనూ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి తానేంటో నిరూపించుకుంది.