తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ.. 'రోడ్డెక్కిన రైతన్న' - ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల నిరసన

ధాన్యం కొనుగోళ్లలో అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ... రాష్ట్రంలో పలుచోట్ల అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొరత, అధికారుల తీరుతో రోజుల తరబడిగా ధాన్యం నిలిచిపోతుందంటూ రహదారులపైకి వచ్చి... ధర్నాలకు దిగారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట... ఇప్పటికే అకాల వర్షాలకు నీటిపాలైనా... ఇప్పటికీ కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

farmers protest against delay in paddy procurement in telangana
farmers protest against delay in paddy procurement in telangana

By

Published : May 27, 2022, 8:00 PM IST

ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ.. 'రోడ్డెక్కిన రైతన్న'

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలో వడ్ల కొనుగోలు కేంద్రంలో జాప్యాన్ని నిరసిస్తూ.... రైతులు రోడ్డెక్కారు. 'సిద్దిపేట - హనుమకొండ' ప్రధాన రహదారిపై కాంగ్రెస్‌ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. ఆలస్యంగా కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించటంతో ... ఇప్పటికీ సగం వడ్లు కూడా అమ్ముడుపోలేదని వాపోయారు. ఇప్పటికే అకాల వర్షాలతో పాటు వర్షాకాలం సమీపిస్తుండటంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తరుగు పేరుతో కిలోలకొద్దీ తరుగు తీస్తూ...దోచుకుంటున్నారని రైతులు వాపోయారు. అన్నదాతల ఆందోళనతో దిగి వచ్చిన ఆర్డీవో... కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తిచేస్తామని, మిల్లర్లు ఎక్కువ తీస్తే తమ దృష్టికి తీసుకురావాలని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హజీపూర్ గేట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోవటంతో... వర్షాలకు తడిసిపోతున్నట్లు రైతులు తెలిపారు. రోజుల తరబడిగా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వాపోయారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని మామిడిపల్లిలో రైతులు రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. గోవింద్‌పేట్‌ సొసైటీ ఆధ్వర్యంలో 5 వేల బస్తాల వరకు ధాన్యం ఉందని....వాటిని కొనుగోలు చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వాపోయారు. కొనుగోలు చేసిన వాటిని తరలించేందుకు లారీల కొరత వేధిస్తోందని చెప్పారు. తరుగు పేరుతో క్వింటాల్‌కు 15 కిలోల వరకు తీస్తున్నారని చెప్పారు. రైతుల ఆందోళనకు భాజపా నేతలు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలుగైదు రోజుల్లో కొనుగోలు ప్రక్రియ దాదాపు పూర్తిచేస్తామన్న తహసీల్దార్‌ హామీతో రైతులు ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details