తెలంగాణ

telangana

By

Published : Jul 30, 2021, 8:47 AM IST

ETV Bharat / state

అక్కగా పుట్టింది.. అమ్మగా మారింది

తమ్ముళ్లను, చెల్లిని విడిచిపెట్టకు అని చనిపోయేటప్పుడు తల్లి చెప్పిన మాటలకు ఆమె కట్టుబడింది. తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు.. తమ్ముళ్లను, చెల్లిని ప్రయోజకులను చేయాలనుకుంది. తల్లి చనిపోయింది.. తండ్రి తమను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అయినా ఆమె అధైర్యపడలేదు. 14 ఏళ్ల వయస్సులో నలుగురి బాధ్యతను నెత్తినేసుకుంది. చదువుకోకపోవడం వల్ల లోకం తెలియదు. ఏం చేసైనా.. తన తమ్ముళ్లు, చెల్లికి మంచి భవిష్యత్​ను ఇవ్వాలనుకుంది. భిక్షాటన చేసి వారి కడుపు నింపుతోంది. వారికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఎంత కష్టమైనా పడతానంటుంది. వారి కోసం పని చేసి.. తన గురించి పట్టించుకోవడం మానేసింది. చివరకు ఆసుపత్రి పాలైంది. మరి ఆ పిల్లల పరిస్థితి ఏమైంది?

elder-sister-is-taking-care-of-her-brothers-and-sisters
అక్కగా పుట్టింది.. అమ్మగా మారింది

అక్కగా పుట్టింది.. అమ్మగా మారింది

తల్లి కన్నుమూసింది. తండ్రి వదిలేశాడు. ఈ అయిదుగురు పిల్లలు దిక్కులేనివారయ్యారు. అందరికంటే పెద్దదైన పద్నాలుగేళ్ల బాలిక అందరికీ తానే అమ్మగా మారింది. తల్లికిచ్చిన మాట కోసం వారికి అన్నీ తానై సాకుతోంది. బడి ముఖం చూడని ఆమె భిక్షాటనతో నలుగురు తోబుట్టువులను చదివించేందుకు శ్రమిస్తోంది.

ఆసుపత్రి మంచంపై కనిపిస్తున్న ఈ బాలిక పేరు నజ్మా. ‘తమ్ముళ్లను, చెల్లిని విడిచి పెట్టకు. వాళ్లను చదివించు’ అంటూ తల్లి చనిపోయేటప్పుడు చెప్పిన మాటలకు ఆమె కట్టుబడింది. ‘అమ్మ కామెర్లతో చనిపోయింది. నాన్న ఎటో వెళ్లిపోయాడు. నేనే బిచ్చమెత్తి అందరికీ వండి పెడుతున్నా. ఇద్దరు తమ్ముళ్లను హాస్టల్‌ బడికి పంపుతా. చెల్లిని, ఇంకో తమ్ముణ్ని నాతోనే ఉంచుకుని చదివించుకుంటా’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పింది ఆ బాలిక.

నిజామాబాద్ జిల్లా బోధన్‌ పట్టణం శక్కర్‌నగర్‌ కాలనీకి చెందిన నజ్మా తోబుట్టువులతో కలిసి చిన్న గుడిసెలో జీవిస్తోంది. ఇటీవల ఆమెకు మూర్ఛ రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ పెట్టే ఆహారం తింటూ అయిదుగురూ అక్కడే ఉంటున్నారు. తమది పాములు పట్టే కుటుంబమని, తల్లి భిక్షాటన చేసి తమను పోషించేదని నజ్మా చెప్పింది. ‘చిన్న గుడిసెలోనే ఉంటున్నాం. వర్షం పడితే లోపల నీళ్లు నిండి బట్టలన్నీ తడిసిపోతాయి. అడుక్కొచ్చినవి దాచుకోవడానికి, వంటకూ వీలుండదు’ అని వాపోయింది.

సఖి కేంద్రానికి తరలింపు

ఆసుపత్రిలో అయిదుగురు పిల్లలు ఉన్నారనే విషయం పోలీసులకు, వారి ద్వారా ఐసీడీఎస్‌ యంత్రాంగానికి సమాచారం అందింది. సీడీపీవో వినోద, పర్యవేక్షకురాలు రాధిక, ఆ ప్రాంత అంగన్‌వాడీ కార్యకర్త ఎజాజ్‌బేగం వారి నివాసాన్ని సందర్శించారు. ఆ తరువాత పిల్లలను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. వారి నివాసం సరిగా లేకపోవడంతో 108 అంబులెన్సులో నిజామాబాద్‌లోని సఖి కేంద్రానికి తరలించారు. అక్కడ నజ్మాకు అదనపు వైద్య పరీక్షలు చేయించారు.

వారికి చదువు చెప్పిస్తాం..

" నజ్మాకు ఫిట్స్ రావడంతో ఆసుపత్రిలో చేరింది. ఆమె వెంట ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లి ఉంది. అమ్మానాన్న లేరు వాళ్లకి. ఎటువంటి ఆధారం లేదు. ఆ పిల్లలతో మాట్లాడాం. నజ్మాకు మెరుగైన వైద్యం అందిస్తాం. ఆ పిల్లలందర్ని సఖి సెంటర్​కు తరలిస్తున్నాం. వారందరికి సరైన భోజనం వసతులు కల్పిస్తాం. వారికి చదువు చెప్పిస్తాం."

- వినోద, బోధన్ సీడీపీఓ

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details