రెండు పడక గదుల ఇళ్లు... తెరాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెపట్టిన పథకం. కాంగ్రెస్ హయాంలోని ఇందిరమ్మ ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని భావించిన సర్కారు.. స్వయంగా ఇళ్లు నిర్మించి పేదలకు అప్పగించే బాధ్యత తీసుకుంది. నిరుపేదలు, ఇళ్లులేని వారిని గుర్తించి అప్పగిస్తామని ప్రకటించింది. లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉండటం, ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల నిర్మించిన ఇళ్లు వినియోగంలోకి రాలేకపోతున్నాయి.
420 ఇళ్లు
నిజామాబాద్ నగర శివారులోని నాగారంలో రెండు పడక గదుల ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించడంలో జాప్యం జరుగుతుండటంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి.నాగారంలోని నీరుగొండ హనుమాన్ ఆలయం సమీపంలో జీప్లస్ 2 స్థాయిలో మొత్తం 35 భవనాలు నిర్మించారు. ఒక్కో భవనంలో 12 కుటుంబాలుండేలా తీర్చిదిద్దారు. 420 మంది లబ్ధిదారుల కోసం ఆ ఇళ్లు కట్టించారు. పనులు పూర్తై 6 నెలలు దాటినా లబ్ధిదారులకు అప్పగించలేదు. గత నెలలో పేదల నుంచి నిజామాబాద్ నగరపాలకసంస్థ పరిధిలో దరఖాస్తులను ఆహ్వానించారు. కాని లబ్ధిదారుల ఎంపిక మాత్రం చేయలేదు.