Mana Ooru Mana Badi Program: నిజామాబాద్ పోలీస్ లైన్ ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. గదుల్లోని ఫ్లోరింగ్ శిథిలావస్థకు చేరడంతో పాటు.. మూత్రశాలలు, మరుగుదొడ్లు దెబ్బతిన్నాయి. మరమ్మతులకు ప్రభుత్వం రూ.12 లక్షలతో అనుమతులివ్వగా వసతులు కల్పించారు. మరమ్మతులు చేసి.. రంగులు వేసి కొత్తగా తీర్చిదిద్దారు. బ్లాక్ బోర్డుల స్థానంలో గ్రీన్‌బోర్డులు ఏర్పాటు చేశారు. మంచి నీటి ట్యాంకు నిర్మించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో ఆ వసతులు కల్పించారు.
బోధన్, బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో మరమ్మతులు చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. సర్కారు బడుల్లో మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో విద్యా సంవత్సరం ప్రారంభంలో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ జిల్లాలో 1,156 ప్రభుత్వ పాఠశాలలుంటే తొలి దశలో 407 బడులు ఎంపిక చేశారు. రెండింటిలో ఏ ఇబ్బందిలేవని గుర్తించారు. చివరికి 405 బడుల్లో రూ.109 కోట్లతో పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు లభించాయి.
రూ.30 లక్షలకు పైగా నిధులు ఖర్చయ్యే పాఠశాలలు 105 ఉన్నట్లు అధికారులు తేల్చారు. వాటికి టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కనీసం మండలానికి రెండు పాఠశాలల పనులైనా పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులు భావించారు. చివరికు 17 బడులకే పరిమితం కావాల్సి వచ్చింది. అనేక పాఠశాలల్లో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభించారు. ఎక్కువ శాతం పాఠశాలల్లో పనులు ప్రారంభం కాకపోవడంతో అరకొర వసతుల మధ్యే విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పనుల్లో వేగం పెంచి తొందరగా మరమ్మతులు పూర్తి చేయాలని విద్యార్థులతో పాటు.. వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.