ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల పది రోజుల పాటు కురిసిన వర్షాలకు 242.85 కి.మీ రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రతిపాదనలు రూపొందించారు. ధ్వంసమైన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు రూ.2.36 కోట్లు అవసరమని అధికారులు గుర్తించారు. అదేవిధంగా రోడ్లు, కల్వర్టులు, వంతెనల శాశ్వత నిర్మాణానికి రూ.87.14 కోట్లు అవసరమవుతాయని ఆ శాఖ అధికారులు నివేదించారు.
గడిచిన వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలు రోడ్లు, కల్వర్టులు, దెబ్బతిన్నాయి. రామారెడ్డి మండలం కేంద్రం నుంచి తూంపల్లికి వెళ్లే రోడ్డుమార్గంలో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. జుక్కల్, మద్నూర్ మండలాల్లో రోడ్లన్నీ తెగిపోయాయి. బోధన్, కోటగిరి, వర్ని, సిరికొండ మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు రూపొందించారు.
వేర్వేరుగా ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 242 కి.మీ మేర పాక్షికంగా ధ్వంసమైనట్లు రహదారులు భవనాల శాఖ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి వేర్వేగా ప్రతిపాదనులు రూపొందించారు. చాలా రోడ్లపై పెద్ద ఎత్తున గుంతలు నెలకొన్నాయి. వీటిని అలానే వదిలేస్తే పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. వీటికి తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.