CM KCR LATEST SPEECH: నిజామాబాద్‌లో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో ఇందూరు చేరుకున్న ముఖ్యమంత్రి.. ముందుగా ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో నిర్మించిన తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన భవనంలో పార్టీ నేతలతో కలిసి అధినేత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం దుబ్బ ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎంవో అధికారి స్మితా సబర్వాల్‌తో కలిసి సమీకృత కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కూర్చుండబెట్టి.. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
బావి దగ్గర మీటర్లు పెట్టమనే సర్కారును సాగనంపాలి..: కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తెరాస బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెరాస పాలనలో తెలంగాణలో ఎక్కడా కరెంటు సమస్య లేదని.. భాజపా ప్రభుత్వం రైతుల మోటార్ల లెక్కలు తీయమంటోందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ విక్రయించిన మోదీ సర్కార్.. ఇక రైతుల మీద పడి వ్యవసాయ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు యత్నిస్తుందని విమర్శించారు. ఎన్పీఏ పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టిన కేంద్రం.. రైతులకు మాత్రం ఉచితాలు ఇవ్వొద్దనటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దిల్లీ గద్దె మీద తమ ప్రభుత్వమే రాబోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు. 2024లో భాజపా ముక్త్ భారత్ కావాలన్న ఆయన.. బావి దగ్గర మీటర్లు పెట్టమనే సర్కారును సాగనంపాలని పిలుపునిచ్చారు.
ప్రజలు దీవిస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్..: దేశమంతా ఆశ్యర్యపోయేలా తెలంగాణను అభివృద్ధి చేసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. రైతులకు ఉచితంగా నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న కేసీఆర్.. రైతులంతా మద్దతుగా నిలిస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు.
మోదీ చేస్తున్న ఏకైక పని అదే..: ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూలదోయడమే ప్రధాని మోదీ చేస్తున్న ఏకైక పని అని కేసీఆర్ విమర్శించారు. దేశ రాజకీయాల్లోకి రావాలని జాతీయస్థాయి రైతు నాయకులు కోరుతున్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే నిజామాబాద్ గడ్డ నుంచే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని ఆయన స్పష్టం చేశారు.