నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గత ఐదు రోజుల నుంచి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షను గిరిజనులు శనివారం విరమించారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించి వసతులు కల్పించాలని ఆదేశించారు. దీంతో రెండు రోజుల క్రితం చాకిరేవు గ్రామంలో అధికారులు రెండు బోర్లు వేయించడంతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మళ్లీ పాదయాత్ర చేసి కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష చేస్తామని గిరిజనులు పేర్కొన్నారు. దీక్ష విరమించిన గిరిజనులకు డీఎస్పీ భోజనాలు ఏర్పాటు చేయించి.. వాహనాన్ని సమకూర్చి గ్రామానికి పంపించారు.