ప్రభుత్వ వైద్య అధికారులకు, ప్రైవేట్ వైద్యులకు మధ్య వివాదం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శస్త్రచికిత్సల ద్వారా ఎక్కువ ప్రసవాలు చేస్తున్నారన్న ఆరోపణతో.. నిర్మల్, భైంసా పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం(మార్చి 29) రోజు దాడులు నిర్వహించి 6 ప్రైవేట్ ఆసుపత్రుల ఓపీ సేవలను సీజ్ చేశారు. దీనిపై ఐఎంఏ వైద్యులు అత్యవసర సమావేశం నిర్వహించి.. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, వైద్య అధికారుల తీరుకు నిరసనగా వైద్య సేవలు పూర్తిగా నిలిపేశారు. సీజ్ చేసిన ఆస్పత్రులను తిరిగి ప్రారంభించే వరకు వైద్య సేవలు నిలిపేస్తున్నట్టు పేర్కొన్నారు. ఫలితంగా రోగులు ఇబ్బందులు పడ్డారు.
సీజ్ చేసిన ఆయా ఆస్పత్రుల వద్ద ప్రసవాల కోసం వచ్చిన గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్మల్‌లోని శ్రీ ఆదిత్య ఆసుపత్రిలో వైద్యులకు గర్బిణీ బంధువులకు డెలివరీ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. నార్మల్ డెలివరీ వద్దని సిజేరియన్ చేయాలని గర్భిణీ తరఫువాళ్లు కోరారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ ఆసుపత్రికి చేరుకున్నారు. బందువులకు నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. శస్త్రచికిత్స చేసే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో.. బాధితులు నిజామాబాద్‌కు వెళ్లారు. మరోవైపు.. స్వర్ణ ఆసుపత్రి వద్ద ఓ గర్భిణీని అధికారులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలో వైద్యసేవలు నిలిపివేశారని.. లోపలికి వెళ్లేందుకు వీల్లేదని చెప్పారు. గర్భిణీ కుంటింబీకులు కంట తడిపెడుతూ వేడుకున్నా లోపలికి అనుమతించలేదు.. కలెక్టర్ అనుమతి తీసుకురావాలన్నారు. కోపోద్రిక్తులైన బాధితులు.. గర్భిణికి ఏదైనా జరిగితే మీరే బాధ్యులంటూ రోడ్డుపై బైఠాయించటంతో.. ఆస్పత్రిలోకి అనుమతించారు.