నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సమావేశం ఏర్పాటు చేశారు. గతనెలలో వైద్యుల హాజరు శాతంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక నుంచి వైద్యులు కచ్చితంగా సమయపాలన పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి ఆసుపత్రిలో సీసీ టీవీ కెమెరాలు పనిచేయాలన్నారు. వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగాలని, ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రతి బాలింతకు కేసీఆర్ కిట్ అందజేయాలన్నారు.
'ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలి' - nirmal district news
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని వైద్య శాఖ అధికారులను నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా బాధితులకు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
కరోనా పరీక్షలు నిరంతరం నిర్వహిస్తూ బాధితులకు ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. అప్రమత్తంగా ఉంటూ మరణాల రేటును తగ్గించాలన్నారు. వ్యాధిపై ప్రజలు భయాందోళనలు చెందకుండా జాగ్రత్తలు పాటించేలా వారికీ అవగాహనా కల్పించాలని సూచించారు. క్షయ వ్యాదిగ్రస్తులకు ప్రత్యేక చికిత్సలు అందించాలని, ప్రజల ఆరోగ్యంపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. అంతకుముందు నిర్మల్, బైంసా, ఖానాపూర్ ఏరియా ఆసుపత్రుల్లో రోగులకు భోజన సదుపాయాలు కల్పించేందుకు నిర్వహించిన టెండర్ల ఖరారు ప్రక్రియలో వైద్యశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గంబూషియా అను నేను.... మీ జిల్లాకు వచ్చేశా.. దోమల భరతం పడతా!