రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది. ఖరీఫ్ సీజన్ తొలినాళ్లలో వానలను చూసి మురిసిపోయిన అన్నదాతలకు... వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో తిప్పలు తప్పడం లేదు. మొలక దశలోనే పంటలపై తన ప్రతాపం చూపించాడు. గతకొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు చెరువు కట్టలు తెగటంతో నిర్మల్ జిల్లాలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. సారంగాపూర్ మండలం బోరిగాంలోని చెరువు కింద ఉన్న 900 ఎకరాల్లో వరి నీట మునిగింది.
వర్షార్పణం
జిల్లాలోని బోరిగాం చెరువు కట్టపై ఉన్న వంతెన కూలటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంటపొలాల్లో ఇసుకమేటలు వేసిందని వాపోయిన రైతులు ఈ సంవత్సరమంతా సాగుకు పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాకపోకలకు తిప్పలు
చెరువు కట్ట కోతకు గురికావడంతో నీరంతా వృథాగా పోయింది. ఇక చెరువు కట్ట మరమ్మతులు చేసేదెప్పుడు, చెరువు నిండేదెప్పుడని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరద తాకిడితో సారంగాపూర్ బోరిగాం రహదారిపై ఉన్న వంతెన నేలమట్టమైంది. రాకపోకలు నిలిచిపోయాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షానికి బోరిగాం చెరువు కట్టతెగింది. చెరువులోని నీరంతా వృథాగా బయటకు పోయింది. వరద నీరు తాకిడితో సమీపంలోని బ్రిడ్జి కూలిపోయింది. రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ చెరువు ఆధారంతో దాదాపు 900 ఎకరాలు సాగవుతోంది. ఆ రైతులందరికీ నష్టం వాటిల్లింది. గ్రామంలో తీవ్రంగా పంటనష్టం జరిగింది. అధికారులు స్పందించి... మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం.