నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రముఖ నేతలకు లబ్ధి చేకూర్చేలా.. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని అధికారులు ధారాదత్తం చేస్తున్నారని.. న్యూపోచంపాడ్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన పోచంపాడ్ గ్రామానికి.. అప్పటి ప్రభుత్వం నిర్మల్ సమీపంలో జాతీయ ప్రధాన రహాదారి పక్కనే న్యూపోచంపాడ్ పేరిట పునరావాసం కల్పించింది. దాదాపుగా 120 కటుంబాలు కలిగిన గ్రామానికి అవసరాల నిమిత్తం 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆ భూమిని గ్రామస్థులు పశువుల మేతకు తదితర అవసరాలకోసం వినియోగించుకుంటున్నారు.
గ్రామస్థులకే ఇవ్వాల్సి ఉంది
ప్రాథమిక నిబంధనల ప్రకారమైతే పూర్తి స్థాయిలో న్యూపోచంపాడ్ గ్రామస్థులకే ఆ భూమిని ఇవ్వాల్సి ఉంది. గ్రామ అవసరాల కోసం వినియోగించుకోవాలి కానీ.. ఎవరూ తీసుకోవద్దని ఏళ్ల కిందటనే తీర్మాణించుకోవడంతో ఇప్పటిదాకా ఏ సమస్య తలెత్తలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత భూముల ధరలకు రెక్కలు రావడం వల్ల ఆ భూమిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఓ ప్రముఖ నేత, ఓ రెవెన్యూ అధికారి కుమ్మక్కై... బినామీ వ్యక్తుల పేరిట పట్టా అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.