రాష్ట్రంలో నియంత పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి.. తెరాస, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోనీయకుండా మజ్లీస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కాకుండా.. ఇప్పుడు కూడా తెరాస ప్రభుత్వాన్ని కూడా ఆపేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ గడ్డ మీద విమోచన దినోత్సవాలు ఎందుకు జరుపుకోనివ్వరని... సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య పాలన భాజపాతోనే సాధ్యం..
"ఆ రోజు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోకుండా.. నిజాం రాజులు రజాకర్లతో కలిసి అడ్డుకున్నారు. ఈనాడు వేల మంది వీరుల త్యాగాలతో సాధించుకున్న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకుండా ప్రభుత్వాలను ఎంఐఎం పార్టీ అడ్డుకుంటోంది. నిజాంలు తమ ప్రైవేటు ఆర్మీ అయిన రజాకర్లతో కలిసి ఎంతో మంది వీరులను పొట్టనబెట్టుకున్నారు. వేయి మందిని ఇదే నిర్మల్ గడ్డ మీద ఉరి తీశారు. తప్పుడు నాయకులు అడుగుపెట్టి అపవిత్రం చేసిన ఈ నిర్మల్ గడ్డను పవిత్రం చేసేందుకే.. భాజపా పూనుకుంది. అందుకే నేడు అమిత్ షా నిర్మల్‌కు వచ్చారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కుటుంబపాలన నుంచి విముక్తినిచ్చి ప్రజాస్వామ్య పాలన తేవటం భాజపా వల్లే అవుతుంది. అలాంటి పాలన రావాలంటే భాజపాను ఆశీర్వదించండి. మోదీని, అమిత్‌షాను, బండి సంజయ్‌ను, ఈటల రాజేందర్‌ను ఆశీర్వదించండి." - కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
'నియంత పాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు' ఇదీ చూడండి: