నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో జరిగిన ప్రమాద ఘటనకు నేటికి సరిగ్గా నెల రోజులు. ఏప్రిల్ 10న ఉదయాన్నే ఉపాధి హామీ పథకం కింద కందకాలు తవ్వేందుకు వెళ్లారు. మధ్యాహ్నం వేళ నీడలో సేదదీరేందుకు... అప్పటికే తవ్వేసి వదిలేసిన మట్టి దిబ్బ కింద కూర్చున్నారు. రాత్రి వర్షానికి మట్టిదిబ్బ తడిసిపోయింది. అదే వారి పాలిట మృత్యుదిబ్బగా మారింది. ఒక్కసారిగా అది కూలి మీదపడటంతో 10మంది అక్కడే సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో మృతిచెందిన వారంతా నిరుపేద మహిళలే. ఈ విషాదం నుంచి ఇప్పటికీ ఆ గ్రామం కోలుకోలేదు. మృతిచెందిన మహిళలకు మూడేళ్ల నుంచి 17ఏళ్లలోపు పిల్లలు ఉండటంతో వారి ఆలనాపాలన ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది.
మృతుల కుటుంబాలకు పరిహారం అందినా... ప్రభుత్వం ఇచ్చిన మరిన్ని హామీలపై పురోగతి లేదని బాధితులు వాపోతున్నారు. ఇంటికో ఉద్యోగం, పిల్లలకు ప్రభుత్వ వసతి గృహంలో ప్రవేశం, రెండు పడకల ఇళ్లు, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అధికారులు అంగీకరించారని బాధితులు చెబుతున్నారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ప్రమాదం వల్లే ఈ ఘటన జరిగిందని.. ఎవరి తప్పులేదని విచారణ కమిటీ చెప్పడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.