ఉపాధ్యాయ వృత్తి అంటే బోధించడమే కాదు... విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అని గుర్తు చేస్తున్నారు... నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. మొదట సొంత ఖర్చులతో పాఠశాలలోని చిన్న చిన్న సమస్యలు పరిష్కరించారు. తర్వాత దాతల సహకారంతో బడి రూపురేఖలే మార్చేశారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా... 2018-19 సంవత్సరానికి జిల్లాలో స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైంది.
గ్రామస్థుల సహకారంతో...
2018 జూన్ నెలలో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్... తోటి ఉపాధ్యాయుల సహకారంతో 40 వేల రూపాయలు పోగుచేసి పాఠశాల భవనానికి రంగులు వేయించి, విద్యార్థులు స్ఫూర్తి పొందేలా నీతి వాక్యాలు రాయించారు. తర్వాత గ్రామస్థులతో సమావేశం నిర్వహించి పాఠశాలలో సమస్యలు పరిష్కరించేందుకు చేయూతనివ్వాలని కోరారు. పూర్వ విద్యార్థుల చొరవతో కేవలం ఇరవై రోజుల్లో 3లక్షల రూపాయలు జమయ్యాయి. ఈ నిధులతో మరుగుదొడ్లకు మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, గ్రంథాలయం గది, ప్రతి తరగతి గదిలో ఫ్యాను, సభావేదిక, తడి, పొడి చెత్త వేరు చేసేందుకు కుండీలు ఏర్పాటు చేశారు.