Special Story on Youngest Web Designer: కృత్రిమమేధతో పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నఈ రోజుల్లో సాంకేతికత అందిపుచ్చు కున్న యువతదే హవా. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిపిన్న వయసులోనే ఔపోసన పట్టాడు ఈ కుర్రాడు. తక్కువ సమయంలో 20వెబ్ సైట్లు క్రియేట్ చేసిన పిన్నవయస్కునిగా రికార్డుల కెక్కాడు. తనంతట తానే నేర్చుకుంటూ నిత్యం జ్ఞాన సముపార్జన చేశాడు.
ఈ యువకుడి పేరు త్రిశాల్ దోమ. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రం వాసి. తండ్రి సుధాకర్ బోటనీ లెక్చరర్. తల్లి వాణి గృహిణి. ప్రస్తుతం మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు ఈ కుర్రాడు. నిత్యం ఏదో నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండేవాడు. అలా కొవిడ్ సమయంలో వెబ్ డిజైనింగ్ వైపు అడుగులు వేశాడు. తన వెబ్‌సైట్స్ సమాజానికి, రైతులకు ఉపయోగపడేలా ఉండాలనుకున్నాడు త్రిశాల్. 8వ తరగతిలో ఉన్నప్పుడే వెబ్‌డిజైనింగ్‌కు సంబంధించిన బేసిక్స్ నేర్చుకున్నాడు. వాటితో పాటు స్వతహాగా కొన్ని మెళకువలు పెంపొందించుకున్నాడు. తర్వాత వెబ్ డిజైనింగ్ మొదలుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని నిర్ణయించుకున్నాడు. తగ్గట్టుగా కష్టపడ్డాడు. విభిన్నాంశాలపై వెబ్‌సైట్స్ క్రియేట్ చేశాడు.
'నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మా అక్క ప్రోత్సాహంతో వెబ్ డిజైనింగ్ మీద మరింత మక్కువ పెరిగింది. 2 గంటలలో నా మొదటి వెబ్‌సైట్ క్రియేట్ చేశాను. తర్వాత ప్రాక్టీస్‌లో 1.30గంటలకు, ఆతర్వాత చివరకు 45 నిమిషాలలో పూర్తి చేయగలిగాను. దీనికి నాకు డిసెంబర్ 16న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అవార్డు రావడం జరిగింది. మా నాన్న వల్ల వెబ్ డిజైనింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది. రెస్టారెంట్లు, స్కూళ్లు, రైతులకు సంబంధించిన కొన్ని వెబ్‌సైట్స్ నేను క్రియేట్ చేశాను. మొత్తం 7 విభాగాలకు చెందిన వెబెసైట్లు రూపొందించాను. చదువయ్యాక వెబ్ డెవలపర్‌గా రాణిస్తాను.'-త్రిశాల్, వెబ్ డిజైనర్