రాష్ట్రంలో సాగునీటి సౌలభ్యం పెరిగినందున రైతులకు అవసరమైన అన్నీ సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నారాయణ పేట జిల్లాలోని ధన్వాడ మండలంలో రూ. 3 కోట్ల నిధులతో నిర్మించిన వ్యవసాయ గిడ్డంగిని, ధన్వాడ క్లస్టర్ రైతు వేదిక, వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
రాబోయే రోజుల్లో ..
నూతనంగా ప్రారంభించిన గిడ్డంగిలో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ చేసుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా రైతులు తాము పండించిన పంటను గోదాములో నిల్వ చేసుకొని లాభం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం కలిగిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా..
రాష్ట్రంలో రైతుల కోసం సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా .. రైతులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతు వేదికలు, కల్లాలు, సబ్సిడీపై ఆధునిక యంత్రాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.