Inter Practicals Classes Nill In Narayana peta: సైన్స్ విద్యార్థులకు ప్రయోగాలు తప్పనిసరి. బోధించిన విషయాలను ప్రయోగ పూర్వకంగా వివరిస్తేనే వాటిపై అవగాహన కలుగుతుంది. భౌతిక, జీవ, రసాయన శాస్త్రాల్లో.. ప్రయోగాలపై ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి.. వాటికి మార్కులు కేటాయిస్తారు. ఇంతటి ప్రాధాన్యమున్న ప్రయోగ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. నారాయణపేట జిల్లాలోని కొన్నికళాశాలల్లో.. ప్రాక్టికల్స్ చేసేందుకు.. అవసరమైన రసాయనాలు, పరికరాలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో.. పరీక్షలకు సన్నద్ధమయ్యేది ఎలా అని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద, మద్దూరు, కోస్గి, మక్తల్, మాగనుర్, ధన్వాడ, ఊట్కుర్ జూనియర్ కళాశాలల్లో.. ప్రయోగాలు చేసేందుకు పరికరాలు ఉన్నప్పటికీ.. రసాయనాలు, లవణాలు, సూచికలు లేక నామమాత్రంగా ప్రయోగ తరగతులు నిర్వహిస్తున్నారు. నారాయణపేట, కృష్ణ, మరికల్ కేజీబీవీలలో ప్రయోగ పరికరాలు పూర్తి స్థాయిలో సరఫరా కాలేదు. ల్యాబ్‌లో సైతం సరైన వసతులు లేవని అధ్యాపకులు అంటున్నారు.
రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో.. అప్పటి రసాయనాలతోనే ప్రయోగాలు చేయాల్సివస్తుందని అధ్యాపకులు అంటున్నారు. చేసిన ప్రయోగాలు సైతం.. సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. పరీక్షలకు ఇంకా నెలరోజుల సమయమే ఉండటంతో.. విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు కావాల్సిన పరికరాలను అందజేయాలని కోరుతున్నారు.