రిజర్వాయర్ కోసం వందల ఎకరాలు వదులుకున్నారు.. ప్రాజెక్టు వేగంగా పూర్తయితే వేల కుటుంబాలు బాగుపడతాయని సంబురపడ్డారు.. పునరావాసంలో భాగంగా ఇళ్లు కేటాయిస్తామంటే మురిసిపోయారు.. కానీ ఇదంతా గతం. అంటే పదేళ్ల కిందటి పరిస్థితి... పరిహారం అందక.. ప్రాజెక్టుతో ఇంట్లోకి ఊట నీరుతో అవస్థలు పడుతూ.. ప్రభుత్వం, అధికారుల చేయూత కోసం ఎదురు చూపులు.. ఇది ప్రస్తుతం పరిస్థితి.. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం నెరడగం గ్రామస్థుల దుస్థితి.
సంగం బండ రిజర్వాయర్.. నెరడగం గ్రామానికి కేవలం ఎనిమిది వంద మీటర్ల దూరంలోనే ఉంది. నిర్మాణ సమయంలో హామీల వర్షం కురిపించిన అధికారులు.. అనంతరం తమవైపు చూడడం మానేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా.. ఎప్పుడు వర్షం కురిసినా.. ఊట నీరుతో అవస్థలు పడుతూనే ఉన్నామని వాపోయారు. రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం వల్ల గోడలు, ఇళ్లు కూలి ఎందరో నిరాశ్రయలు, మరెందరో క్షతగాత్రులయ్యారని కంటతడిపెట్టారు. మరికొంత మంది ఇళ్లలో రోజుల తరబడి మోటార్లు పెట్టి నీరు బయటకు తీయాల్సిన పరిస్థితి ఉందంటే.. అక్కడ ఎలాంటి దుస్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామో అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు.