కొవిడ్ నియంత్రణ, ధాన్యం సేకరణలో ఏవైనా సమస్యలు తలెత్తితే.. ఆయా ఎమ్మెల్యేలకు తెలియజేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నారాయణపేట కలెక్టరేట్లో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి.. మహమ్మారి కట్టడి, ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మేర రెమ్‌డెసివర్ మందులతో పాటు అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయంటూ.. ప్రజలు భయాందోళన పడాల్సిన అవసరం లేదని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఫీవర్ సర్వేను పక్కగా నిర్వహించి.. లక్షణాలున్న వారికి వెంటనే వైద్యం ప్రారంభించాలని మంత్రి అధికారులకు సూచించారు. అవసరాలను బట్టి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాజిటివ్ కేసులను పీహెచ్‌సీల వారిగా విభజన చేసుకొని.. మధ్యాహ్నం తర్వాత గ్రామాల్లో తిరుగుతూ బాధితులతో మాట్లాడాలని డాక్టర్లను కోరారు. పంచాయతీ సెక్రెటరీ నుంచి ఏఎన్ఎం, ఆంగన్వాడీ, డాక్టర్లంతా ఒక టీమ్‌గా పని చేయాలని విజ్ఞప్తి చేశారు.