నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని సంగంబండ, కోయిల్ సాగర్ జలాశయాల ప్రధాన కాలువల నుంచి చెరువులు నింపుతున్న క్రమంలో శిఖం భూములతో పాటు పట్టా భూములు ముంపునకు గురవుతున్నాయి. రైతులకు సొంత భూములు ఉన్నా సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని మూడు గ్రామాల చెరువుల కింద 152 ఎకరాల పట్టా భూములు ముంపునకు గురయ్యాయి.
పట్టా భూములూ ముంపు
నర్వ మండలంలోని పెద్ద చెరువుకు సంగంబండ ప్రధాన కాలువ ద్వారా కొన్నేళ్లుగా సాగునీటిని ఇస్తున్నారు. చెరువు శిఖం విస్తీర్ణం 149.33 ఎకరాలు. నీటి నిల్వలు గరిష్ఠ మట్టాన్ని దాటి అలుగు పై భాగం వరకు నింపుతున్నారు. ఈ క్రమంలో శిఖం భూమితో పాటు చాలా మంది రైతుల పట్టా భూములు సుమారు 109.29 ఎకరాల వరకు ముంపునకు గురవుతున్నాయి. సర్వే నంబరు 106లో 24 ఎకరాలు, ప్రభుత్వ భూమిలో 20 ఎకరాల వరకు మునిగిపోయింది. సర్వే నంబర్ 116లో ఆలయాల భూమి 1.22 ఎకరాలు మునిగిపోగా.... కేవలం 0.18 ఎకరాలు మాత్రమే మిగిలింది.