Difficulties for students to cross the canal: నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం, గోటూరు గ్రామం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పొలాల్లో పిల్లబాట వెడల్పులో ఉండే రెండు విద్యుత్తు స్తంభాలపై నుంచి నడుచుకుంటూ భయం భయంగా బడికి వెళుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే రోజు వారికి కత్తి మీద సామే అని చెప్పాలి. ఉదయం బడికి వెళ్లే సమయంలో, సాయంత్రం బడి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్థులకు సాహసమైన ఫీట్లు తప్పడం లేదు.
గ్రామానికి కిలోమీటరు దూరంలో పాఠశాల ఉంది. అక్కడకు వెళ్లాలంటే సుమారు పది అడుగుల కంటే లోతైన కోయిల సాగర్ కుడికాలువ దాటాలి. రైతులు తమ పొలాలకు వెళ్లడానికి కాలువపై రెండు స్తంభాలను వేసి సిమెంటు కాంక్రీట్ వేశారు. దీనిపై నుంచే విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాలకు సుమారు 300 మీటర్ల దూరంలో వంతెన ఉన్నప్పటికి.. దూరమని విద్యార్థులు దాన్ని వినియోగించుకోవడంలేదు.