Delay in Thimmareddipalli Bridge Works Narayanpet :నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామం. మహబూబ్‌నగర్ మద్దూరు ప్రధాన రహదారి నుంచి ఈ గ్రామానికి వెళ్లాలంటే ముందుగా వాగు దాటాలి. వానాకాలం వాగు పొంగితే ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. అలా ఏడాదిలో రెండు, మూడు నెలలుగ్రామస్థులు ప్రమాదకరంగా వాగుదాటుతూ ప్రయాణాలు కొనసాగిస్తారు.
తిమ్మారెడ్డిపల్లి(Thimmareddipalle) వాసులే కాదు. సమీప గ్రామాలైన నందిగామ, గోకుల్ నగర్, దుప్పటిగట్టు, బూనేడు సహా ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న తండా ప్రజలంతా ఆ వాగు దాటే వెళ్లాలి. వాగు ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు.. చుట్టూ 12కిలోమీటర్లు తిరిగి మహబూబ్ నగర్-మద్దూరు ప్రధాన రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు.. స్వాతంత్య్రానికి ముందు నుంచే గ్రామస్తులు ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అక్కడ విద్యుత్త్ స్తంభమే వంతెన... బ్రిడ్జి కట్టాలని విద్యార్థుల అభ్యర్థన
Sri Guru Lokamasand Maharaj (Bavoji gudi) : రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన బావోజీ(Bavoji) జాతర ఏటా ఏప్రిల్ మొదటివారంలో తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోనే జరుగుతుంది. లక్షలాది మంది గిరిజనులు ఈ జాతరకు హాజరవుతుంటారు. అ సమయంలో వాగులో తాత్కాలిక రోడ్డు నిర్మించి రాకపోకల్ని సులభతరం చేస్తారు. మళ్లీ వానాకాలంలో వాగుపొంగి ఆ రోడ్డుకు కొట్టుకుపోతుంది. జాతర సమయంలో మళ్లీ తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మిస్తారు.
తిమ్మారెడ్డిపల్లి వంతెన మాకు దశాబ్దాల కల. ఎన్నో ఏళ్ల నుంచి బ్రిడ్జి నిర్మాణం జరగక అలానే ఉంది. మా ఊరుకి ప్రధాన రహదారి ఇదే. ప్రతి ఒక్కరు ఈ వాగుపై నుంచే పనులకు, చదువుకోవటానికి వెళ్లేది. ప్రయాణాలకు చాలా కష్టమౌతుంది. కానీ పట్టించుకునే వారు లేరు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే.. మా కష్టాలు గుర్తొచ్చేది. తర్వాత ఏ పార్టీ వారు కూడా దీనిపై స్పందించరు. ఎట్టకేలకు గత ఏడాది బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా.. పనులు మాత్రం సాగటం లేదు. - గ్రామస్థులు