తెలంగాణ

telangana

By

Published : May 21, 2020, 8:53 AM IST

ETV Bharat / state

మద్దతు దక్కితేనే సార్థకత!

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేలలు ఏ పంటల సాగుకు అనుకూలమనే అంశంపై మూడు జిల్లాల అధికార యంత్రాంగం సమగ్ర నివేదికలు తయారు చేస్తోంది. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానంపై హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం జరగనున్న సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు హాజరుకానున్నారు.

will telangana crops get minimum support price this year
మద్దతు దక్కితేనే సార్థకత!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం సాగవుతున్న పంటలు, ఇక్కడి నేలలకు ఆ పంటలు సరైనవేనా అన్న అంశంపై ఇప్పటికే అధికారులు అధ్యయనం చేశారు. గురువారం ఈ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో పత్తిని ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సాగు చేస్తున్నారు. గతేడాది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 7.13 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వచ్చింది. ప్రస్తుతం నియంత్రిత పద్ధతిలో పత్తి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తరుణంలో ఉమ్మడి జిల్లాలో గతేడాది కంటే సాగు విస్తీర్ణాన్ని పెంచేలా అధికారులు చర్యలు ప్రారంభించారు.

గతేడాది వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 9 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. సాగు నీటి వసతి లేని మునుగోడు, దేవరకొండ, ఆలేరు, భువనగరి, నల్గొండ, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో దాదాపు 70 శాతం మంది పత్తినే సాగు చేశారు. రెండేళ్ల నుంచి వర్షపాతం సానుకూలంగా ఉండటం, భూగర్భజలాలు పెరగడంతో దిగుబడులు ఎక్కువగానే వస్తున్నాయి. తీరా పండిన పంటను అమ్ముకుందామంటే మద్దతు ధర దక్కని పరిస్థితి.

భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో ఏటా ఇక్కడి రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేస్తున్నా తేమ శాతం ఎక్కువగా ఉందని, పత్తి నాణ్యతగా లేదనే సాకుతో జిన్నింగ్‌ మిల్లుల్లో అధికారులు మద్దతు ధరకు కొనడం లేదు. రైతులు ఇంటి వద్దే తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారు. రైతుల వద్ద నిల్వలు నిండుకున్న సమయంలో సీసీఐ పత్తిని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. దీంతో అంతిమంగా దళారులే లాభపడుతున్నారు. సీసీఐ కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ పెరిగితే పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

కంది పెరగాలి...రంది తగ్గాలి

మరోవైపు కంది సాగుకు ఇక్కడి నేలలు అనుకూలమని వ్యవసాయ అధికారులు చెబుతున్నా ఆ పంట సాగుకు రైతులు ఆసక్తి చూపించడం లేదు. గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 33 వేల ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగైంది. ఎక్కువగా సూర్యాపేట, మునుగోడు, ఆలేరు, భువనగిరి, దేవరకొండ ప్రాంతాల్లోని నేలలు అనుకూలంగా ఉన్నా ఇక్కడి రైతుల్లో అధిక శాతం మంది ఈ పంట సాగుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ పంట సాగు విస్తీర్ణం పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటే గణనీయ సంఖ్యలోనే

పంట సాగు పెరగనుంది.

ఆయకట్టులో సన్న రకాల సాగు

రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి కరీంనగర్‌ తర్వాతి స్థానంలో ఉంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ఎక్కువ మంది రైతులు వరి సన్నరకాలనే కొంత కాలంగా సాగు చేస్తున్నారు. వానాకాలంలో బీపీటీ, పూజ రకాలను యాసంగిలో చింటూ, హెచ్‌ఎంటీ రకాలను పండిస్తున్నారు. దొడ్డు రకాలతో పోలిస్తే పంట కాలం పది నుంచి పదిహేను రోజులు ఎక్కువైనా, నిర్వహణ ఖర్చు పెరిగినా సన్న రకాల వైపే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు.

పంట కోసిన వెంటనే మిల్లర్లు సైతం కొనుగోలు చేయడం రైతులకు సానుకూలాంశంగా మారింది. సన్న రకాల సాగులో నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉన్నా ధర మాత్రం దొడ్డు రకాలతో సమానంగా ఉండటం రైతులను నిరాశకు గురి చేస్తోంది. సన్నాలకు మరింత ధర పెంచేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే ఆయకట్టులో సన్నరకాల సాగు మరో 5 నుంచి 10 శాతం పెరుగుతుంది.

గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేయగా ఈ ఏడాది విస్తీర్ణం మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిగుబడులు సైతం వానాకాలంతో పోలిస్తే యాసంగిలో దాదాపు ఐదు శాతానికి పైగా పెరిగినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details