నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఉపఎన్నిక జరుగుతున్న వేళ... నియోజకవర్గంలోని పలు సమస్యలు పలకరిస్తున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో ప్రజలు వాటికి పరిష్కరాలెప్పుడని ప్రశ్నిస్తున్నారు. ఎంత మంది నాయకులొచ్చినా.. తమ ఇబ్బందులకు మోక్షం మాత్రం దొరకట్లేదని నిలదీస్తున్నారు.
దురావస్థలో వైద్య వ్యవస్థ...
నియోజకవర్గంలో వైద్య రంగం సమస్యలు ఎదుర్కొంటోంది. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా... అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించే వసతులు శూన్యం. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా... మిర్యాలగూడ, లేదా నల్గొండకు తరలించాల్సిన దురవస్థ నెలకొంది. సాగర్‌లో ఆసుపత్రి ఉన్నా వసతులు లేకపోగా... హాలియా పీహెచ్సీలో వైద్యులే ఉండటం లేదు. తిరుమలగిరి సాగర్ మండలంలోని తండాలతోపాటు... పెద్దవూర మండలంలోని మారుమూల గ్రామాల ప్రజలకు... మెరుగైన వైద్యం స్థానికంగా అందడం గగనంగా మారింది.
మరమ్మతుల కోసం రోడ్ల ఎదురుచూపులు...
నియోజకవర్గ వ్యాప్తంగా అంతర్గత రహదారులు అయోమయంగా మారాయి. గతంలో వేసిన దారులే తప్ప... కొత్తగా వేసినవి కనపడటం లేదు. ఎక్కడికక్కడ గోతులు పడి... మరమ్మతుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. హాలియా- పేరూరు, చింతగూడెం- మారేపల్లి, అనుముల- తిమ్మాపురం దారులు ఇబ్బందికరంగా మారాయి. హాలియా- సాగర్ ప్రధాన రహదారి సైతం... అవస్థల నడుమ కొట్టుమిట్టాడుతోంది. ఇలా అంతర్గత రహదారులన్నీ మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి.
ఉపాధి అవకాశాలు శూన్యమే...
సాగర్‌లో చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేక... స్థానికులకు ఉపాధి దక్కడం లేదు. వ్యవసాయ భూమి ఉన్నవారు మాత్రమే... పుష్కలమైన నీటితో పంటలు పండిస్తున్నారు. మిర్యాలగూడ పరిసరాల్లో రైస్ మిల్లులు మినహాయిస్తే... రెండు పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అందులో లభించేవి తక్కువ ఉద్యోగాలే అయినందున... నియోజకవర్గంలోని వ్యక్తులకు ఉపాధి దొరకడం కష్టంగా మారింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న నాగార్జునసాగర్‌లో... కనీసం బస్ డిపో లేకపోవటం శోచనీయం. చివరకు నాగార్జునసాగర్, గుర్రంపోడు వంటి ప్రధాన ప్రాంతాల్లో... ప్రయాణ ప్రాంగణం కూడా లేకపోవడం ఆలోచించాల్సిన విషయం.
ఎండమావిగా మారిన విద్య...
ఇక విద్య పరంగా చూసినా... సాగర్ సెగ్మెంట్లో ఉన్నత విద్య ఎండమావిగానే కనిపిస్తోంది. మిర్యాలగూడ, నల్గొండ... లేదంటే హైదరాబాద్ లోనే ఉన్నత చదువులు చదవాల్సి వస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. ఫిబ్రవరిలో చేపట్టిన పర్యటన ద్వారా ముఖ్యమంత్రి... వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల మొదలవుతుందని ప్రకటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చూడాలని ఆదేశించినా... ఊరికి దూరంగా స్థలం ఉండటం వల్ల అదీ వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తోంది. హాలియాకు మూడు కిలోమీటర్ల దూరంలో కాకుండా... పట్టణానికి సమీపంగా కళాశాల ఉండేలా చూడాలని అక్కడివారు కోరుతున్నారు.
హడావుడి తప్ప కనిపించని ఆచరణ...
ఇక నెల్లికల్ లిఫ్టు పూర్తయితే... మూడు దశాబ్దాల కల సాకారమవుతుంది. దీనిపై గత పర్యటనలోనే ముఖ్యమంత్రి శిలాఫలకాలు వేశారు. ఇక గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములపై కేసీఆర్ ఆదేశాల మేరకు... జిల్లా యంత్రాంగం సర్వే నిర్వహించింది. అయితే ఎన్నికల కోడ్ రావడం వల్ల... ఆ పనులన్ని నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్నికల సమయాల్లో హడావుడి మినహా... మామూలు రోజుల్లో నాయకులు తమను పట్టించుకోవడం లేదని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు నిట్టూరుస్తున్నారు.