Gutta Sukhender Reddy Fires on BJP: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కుంటు పడేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కుయుక్తులు చేస్తోందని గుత్తా విమర్శించారు. అధికారం కోసం వ్యక్తిగత దాడులకూ పాల్పడుతోందని ఆరోపించారు. లిస్ట్ తయారు చేసుకుని మరీ దాడులు చేయడం దారుణమన్న ఆయన.. రాజకీయాల్లో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరమన్నారు. ఇప్పటికే దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టాయని దుయ్యబట్టారు. బీజేపీ చేస్తున్న చర్యలు రాజకీయాలంటేనే ప్రజలు ఈసడించుకునేలా చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత పెట్టి కేంద్రం ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని గుత్తా విమర్శించారు. ఓ వైపు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటూ.. మరోవైపు ఓట్లు అడగటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్ర వైఖరి మారాలని హెచ్చరించారు. తెలంగాణకు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే.. అభివృద్ధి చేసి చూపించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలని గుత్తా స్పష్టం చేశారు.
"తెలంగాణపై కేంద్రానిది కక్షపూరిత వైఖరి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోతలు పెడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా కుయుక్తులు చేస్తోంది. అధికారం కోసం ఎంతకైనా తెగించేలా ఉంది. కేంద్ర పరిధిలోని అన్ని సంస్థలతో దాడులు చేస్తున్నారు." - గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన మండలి ఛైర్మన్