ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవో అమలైతే తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా తన హక్కులను కోల్పోతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. దీని వల్ల తెలంగాణలో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు తగదన్నారు.
నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. నార్కట్ పల్లి, కట్టంగూర్, తిప్పర్తి మండలాల్లోని బత్తాయి, నిమ్మ రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వెయ్యకపోతే రైతుబంధు రాదనడం సమంజసం కాదని... ఎప్పుడు ఏ పంట వేయాలో రైతుకు సూచించడం తగదని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెజస జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.